గత పాలకులు దోచుకున్నారు | Previous Rulers Robbed State said minister malla Reddy | Sakshi
Sakshi News home page

గత పాలకులు దోచుకున్నారు

Published Mon, Mar 4 2019 12:18 PM | Last Updated on Mon, Mar 4 2019 12:19 PM

Previous Rulers Robbed  State said  minister malla Reddy - Sakshi

మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

చేవెళ్ల: గత పాలకులు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని.. ప్రజల కోసం చేసింది ఏమీ లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్‌ స్థాయి ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఆయన చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్‌ ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీతో  కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభ్యున్నతిని చూసి ప్రజలు మరోసారి భారీ మోజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లుగా ఏమి చేయని ఆయా పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని  విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిఇంట్లో ఒకరు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వారే ఉన్నారన్నారు. అందుకే జనం గులాబీ పార్టీ పక్షం నిలబడ్డారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను అత్యధిక మోజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా అంటేనే ప్రత్యేకంగా ఉండాలని, దీనికి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈనెల 9న జరిగే కేటీఆర్‌ బహిరంగ సభను చేవెళ్లలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందికి తక్కువ కాకుండా బహిరంగసభకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చేవెళ్లలో కేటీఆర్‌ పాల్గొనే సభా స్థలాన్ని మంత్రి తదితరులు పరిశీలించారు.

  సభ అదిరిపోవాలి: గట్టు రాంచందర్‌రావు

రాబోయే ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సైనికులుగా పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న చేవెళ్లలో ఎంపీ ఎన్నికల సన్నాహక బహిరంగ సభ జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దశదిశ నిర్దేశించేందుకు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ వస్తున్నారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎంపీ సీటును సాధిస్తామనే ధీమా ఈ సభ ద్వారా కలిగించాలని చెప్పారు.

భారీగా జన సమీకరణ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, డాక్టర్‌ ఆనంద్, మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో వీరు మాట్లాడుతూ.. బహిరంగ సభ కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అత్యధిక ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సభద్వారా టీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలుస్తుందన్నారు. చేవెళ్ల ఎంపీ సీటు గెలుపు ఖాయమనే ధీమాను ఈ సభ ద్వారా కేటీఆర్‌ఎకు ఇస్తామని చెప్పారు. సమావేశంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్‌లు నాగేందర్‌గౌడ్, పర్యాద కృష్ణమూర్తి, కొండల్‌రెడ్డి, స్వప్న, నారాయణ, రాంనర్సింహ్మారెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి, సుజాత, చేవెళ్ల ఎంపీపీ బాల్‌రాజ్, పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పలువురు సర్పంచులు ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement