రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ.
* సీఎం ‘హరితహారం’ బస్సు రెడీ నేడు రోడ్డెక్కనున్న తెలంగాణ ప్రగతి రథం
* అధునాతన సౌకర్యాలతో సిద్ధం చేసిన ప్రభుత్వం జిల్లాల్లో హరితహారం పర్యటనకూ ఈ బస్సునే వాడనున్న సీఎం
*మెర్సిడెస్ బెంజ్ కంపెనీ.. ప్రత్యేక మెటీరియల్‌తో బరువు తక్కువ అర కి.మీ. దూరం వరకూ వినిపించే ప్రత్యేక సౌండ్ సిస్టం
* నాలుగు వైపులా నిఘా కళ్లు లోపల శాటిలైట్ ఫోన్, ప్రత్యేక వైఫై ఏర్పాటు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటన కోసం ప్రభుత్వం ‘తెలంగాణ ప్రగతి రథం’ పేరిట రూ. 5 కోట్లతో ప్రత్యేకంగా అధునాతన బస్సును సిద్ధం చేసింది. హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగే కార్యక్రమాలకు ఆయన ఈ బస్సులోనే వెళ్లనున్నారు. ఇదే కార్యక్రమం కోసం అన్ని జిల్లాల్లో జరిగే పర్యటనలకు కూడా దీనినే వినియోగించనున్నారు. చండీగఢ్‌లో తయారైన మెర్సిడెస్ బెంజ్ కంపెనీ బస్సు గురువారం హైదరాబాద్ చేరుకుంది. శుక్రవారం సీఎం పర్యటన ఉన్నందున ఆర్టీసీ అధికారులు గురువారం రాత్రి బస్సులో అవసరమైన మార్పుచేర్పులు చేసి సిద్ధం చేశారు.
నిర్వహణ ఆర్టీసీకి...
ఈ బస్సు నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ చూస్తుం ది. బస్సు తయారీకి అవసరమైన రూ.5 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయాన్ని రీయింబర్స్ చేయనుంది. బస్సు తిరిగిన సమయంలో హైర్ చార్జీల కింద కిలోమీటరుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.66గా ఉన్న హైర్ చార్జీలను తాజాగా సవరించారు. ఈ బస్సు లీటరుకు 2.5 కి.మీ. మైలేజీ ఇస్తుంది. బాడీకి పూర్తి తెలుపు రంగు వినియోగించారు. రాత్రివేళ రిఫ్లెక్ట్ కోసం దానిపై రేడియం స్టిక్కర్ వేశారు. గతంలో నలుపు రంగులో ఉన్న కాన్వాయ్ కార్లను సీఎం సూచన మేరకు కంపెనీకి పంపి తెలుపు రంగులోకి మార్చిన నేపథ్యంలో బస్సుకు తెలుపు రంగునే ఎంపిక చేశారు.
ఇవీ ప్రత్యేకతలు...
⇔ గతంలో వాడిన పాత బస్సులు దాదాపు 22 టన్నుల బరువుండగా బుల్లెట్‌ప్రూఫ్ కొత్త బస్సుకు పైన, కింద కివిలార్ ప్లాస్టిక్‌ను వాడటంతో బస్సు బరువు 18 టన్నులకు తగ్గింది. ఫలితంగా ఈ బస్సు గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకుపోనుంది. పాత బస్సుల వేగం 70-80 కి.మీ.గా ఉండేది.
⇔ తాను మాట్లాడే విషయాలు దూరంగా ఉండేవారికి కూడా వినపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సూచించడంతో అర కిలోమీటరు దూరం వరకు వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టంను ఇందులో ఏర్పాటు చేశారు.
⇔ గతంలో వాడిన బస్సుల్లో సీఎంకు సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సోఫాలు ఏర్పాటు చేయగా ఈ బస్సులో సోఫాలు వద్దని కేసీఆర్ సూచించడంతో సీఎం కాకుండా మరో 20 మంది ప్రయాణించేలా సీట్లు అమర్చారు.
⇔ బస్సు బయటివైపు ఏర్పాటు చేసిన నాలుగు కెమెరాలు ఆటోమేటిక్‌గా చిత్రీకరణను రికార్డు చేస్తాయి. వాటిని లోపల తిలకించే వ్యవస్థ ఉంది.
⇔ ఇందులోని సీఎం కార్యాలయంలో శాటిలైట్ ఫోన్, వైఫైతో ఇంటర్నెట్, కంప్యూటర్లు, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యాలు కల్పించారు.