తెలంగాణలో అర్చకులు తమ సమ్మెను విరమించారు.
హైదరాబాద్: తెలంగాణలో అర్చకులు తమ సమ్మెను విరమించారు. తమకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో పాటు మరికొన్ని డిమాండ్లతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అర్చకుల సమ్మె కారణంగా అసలు చాలావరకు దేవాలయాల తలుపులే తెరుచుకోలేదు. దేవుడికి హారతులు, నిత్య ధూప దీప నైవేద్యాలు కూడా కరువయ్యాయి.
గత జూన్‌లో సమ్మె చేసిన సమయంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో అర్చకులు, ఉద్యోగుల జేఏసీ మళ్లీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు అర్చకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అర్చకులను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ సర్కారు లేదని చర్చల అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.