
కీసరగుట్ట గోపురం ఎక్కి పూజారి హల్‌చల్
కీసర: దేవాదాయశాఖ అర్చకులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ పూజారి కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆల య గోపురం ఎక్కి హల్‌చల్ చేశాడు. సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ అర్చకులు, ఉద్యోగులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా గురువారం సుమారు 300 మంది అర్చకులు, ఉద్యోగులు నగరంలోని దేవాదాయశాఖ కార్యాలయం నుంచి రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట ఆలయం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి ఆలయ గోపురం ఎదురుగా నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్చక, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి మాట్లాడుతూ అర్చక, సిబ్బందికి ట్రెజరీ 010 ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కీసరగుట్ట పూజారి వెంకటేష్ గోపురం ఎక్కి ఆత్మాహత్యకు యత్నించారు. తోటి అర్చకులు వారించి కిందకు దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.