ప్రై‘వేటు’ దోపిడీ
- సెలవులు, ఎన్నికల నేపథ్యంలో...
- కాస్ట్‌లీగా మారిన ప్రయాణం
- ఆర్టీసీ అరకొర ఏర్పాట్లు
- ప్రయాణికులను నిలువునా దోచేస్తున్న ట్రావెల్స్
- పట్టనట్టు వ్యవహరిస్తున్న రవాణా శాఖ
నాంపల్లి, అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సెలవులు, ఎన్నికలు ఒక్కసారిగా రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పరిమితమైన రైళ్లు.. ఆర్టీసీ బస్సులు చాలని పరిస్థితిలో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నగరం నుంచి చెన్నై, ముంబై, వైజాగ్, బెంగ ళూరు, నాగ్‌పూర్, తిరుపతి, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లలో బెర్త్‌లు లభించకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి.
బెంగళూరు, చెన్నైలకు పెరిగిన రద్దీ
బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఆదివారం ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అధికారులు అదనపు బస్సులు నడిపారు. సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు, చెన్నైలకు ఆర్టీసీ 32 బస్సులను నడుపుతుంది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ఆదివారం 30 అదనపు బస్సులను నడిపారు.
సీమాంధ్రకు 600 అదనపు బస్సులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతానికి 600 అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నందున ఓటు వేసేందుకు నగరం నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులను నడిపనున్నట్లు ఎంజీబీఎస్ ఏటీఎం -1 ఇ.వి.సత్యనారాయణ తెలిపారు.
ప్రతినిత్యం ఎంజీబీఎస్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు నడిపే 720 షెడ్యూల్డ్ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే సీమాంధ్ర వైపు వెళ్లే బస్సుల్లోని సీట్లన్నీ ముందుగానే రిజర్వు కాడవంతో.. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించిందని ఆయన వెల్లడించారు.