the Department of Transportation
-
రెండో వాహనం ఉంటే పన్ను మినహాయింపు?
ఇప్పటికే వాహనం ఉండి.. మరో వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఇలా రెండో వాహనం కొనుగోలు చేసేవారిపై ప్రస్తుతం విధిస్తున్న అదనపు పన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతం ఒక వాహనం కలిగి ఉన్న వ్యక్తి తన పేరుతోనే రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనపు పన్ను భారం మోయాల్సి వస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో సాధారణంగా వసూలు చేసే జీవిత కాల పన్నుతోపాటు మరో 2 శాతం పన్నును రవాణా శాఖ వసూలు చేస్తోంది. అయితే కొందరు యజమానులు వాహనాలు అమ్మేసినా కొనుగోలుదారులు పేరు మార్పించుకోకపోవడం వల్ల పాత యజమానులే అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరికొందరు అదనపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ముందు జాగ్రత్తగా తొలి వాహనాన్ని కుటుంబ సభ్యుల్లో మరొకరి పేరిట బదిలీ చేయించిన తర్వాత రెండో వాహనం కొనుగోలు చేస్తున్నారు. ఇంకా కొందరు అసలు గతంలో తమకు వాహనం లేదని బుకాయించడం.. అధికారులు ధ్రువీకరించుకోలేక ఇబ్బంది పడటం జరుగుతోంది. దీనిపై పరిష్కారమార్గాలను అన్వేషించిన అధికారులు.. రెండో వాహనం పన్ను ఎత్తివేత సరైందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. -
టెక్కలిలో 5 బస్సులు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు. వీటిపై గతంలో కూడా ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
హెల్మెట్ తప్పనిసరి
► హెల్మెట్ లేకుంటే ఇక జరిమానా వాహనదారులు ఇకపై కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. శనివారం హెల్మెట్ లేని వాహనదారుల నుంచి అధికారులు రూ.15 వేలు జరిమానా వసూలు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ అమలుపై కొంత కాలంగా వివిధ రూపాల్లో అవగాహ న కార్యక్రమాలు చేపట్టిన రవాణా శాఖ శనివారం ప్రత్యక్ష తనిఖీలకు శ్రీకారం చుట్టింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై కొరడా ఝళిపించింది. హెల్మెట్ ధరించని వారిపై రూ.100 చొప్పున జరిమానా విధించింది. శనివారం ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ రవాణా అధికారి దశరథం నేతృత్వంలో దాడులు నిర్వహించి పలువురు వాహనదారులకు జరిమానా విధించారు. మరోవైపు హెల్మెట్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించడంతో పాటు, తనిఖీలను కూడా విస్తృతం చేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. మొదటి విడత జరిమానాతో సరిపెట్టినప్పటికీ అదేపనిగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ శాతం ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లనే వాహనదారులు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లోనూ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలై చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా యువత ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ఇంటి నుంచి యలుదేరే ముందు మీపై ఆధారపడిన కుటుంబసభ్యులను గుర్తు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు. కాగా శనివారం నగరవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 143 కేసులు నమోదు చేసి, 15 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం
మహేశ్వరం: టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ పునర్నిమాణం, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకా టీడీపీలో కొనసాగితే ఆత్మవంచన చేసుకున్నట్లేనన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూన యాదయ్య అతని అనుచరులతో కలిసి నగరంలోని మంత్రి నివాసంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్ర పార్టీలకు ఇక కాలం చెల్లిందని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. టీఆర్ఎస్లో చేరిన కూన యాదయ్య మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడిన నాయకుడికి తగిన గుర్తింపులేదన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గ్రహించి పార్టీ మారినట్లు చెప్పారు. కూన యాదయ్యతోపాటు నాయకులు పెద్దమ్మ నర్సింగ్‌రావు, మోహన్ తదితరులు మొత్తం 50 మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సామల రంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రామకృష్ణ తదితరులున్నారు. టీఆర్ఎస్లో చేరిన దీపామల్లేష్ శంషాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దీపామల్లేష్ గురువారం రాష్ట్ర రవాణాశాఖమంత్రి పి. మహేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దీపామల్లేష్ ఎన్నికలకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆమెతో టీఆర్ఎస్లో చేరిన వారిలో మల్లేష్ముదిరాజ్, సరోజిని మహిళా మండలి అధ్యక్షురాలు సునంద, నాయకులు అనసూయ, భార్గవి, ఉమ, విజయలక్ష్మి, జంగయ్య, మైలారం రాములు, లక్ష్మణ్, కృష్ణ, రాజు, శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సంతకం.. సంకటం
విజయవాడలో ‘ఫోర్జరీ ముఠా’ రెవెన్యూ వర్గాల్లో కలవరం రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడ సిటీ : నగరంలో ఫోర్జరీ ముఠాల కార్యకలాపాలు అధికమయ్యాయి. రెవెన్యూ.. రవాణా.. శాఖ ఏదైనా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ స్టాంపులతో బురిడీ కొట్టిస్తున్నారు. కీలక శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో ధ్రువీకరణ పత్రాల తయారీ వ్యవహారం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. విచారణ కోసం వచ్చే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఇవి వెలుగుచూస్తున్నాయి. రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, లంచాల కోసం కొందరు సిబ్బంది వేధింపులు భరించలేక.. అమాయకులు ఫోర్జరీ ముఠాల బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ మంజూరు చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు రెవెన్యూ శాఖ జారీచేసే కుటుంబ ధ్రువీకరణ పత్రాలు, అడంగల్ కాపీలు, రవాణా శాఖ జారీచేసే వాహనాల సి-బుక్కులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బీమా పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్లు.. ఇలా ఏ ఒక్కదాన్నీ ఈ ఫోర్జరీ ముఠాలు వదలడం లేదు. ఆయా ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారిని తమ ఏజెంట్ల ద్వారా గుర్తించి నకిలీవి అంటగడుతున్నారు. అప్పటికప్పుడు పని జరిగిపోతుండడంతో ఈ ముఠాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నవారు మిన్నుకుండిపోతున్నారు. సిబ్బంది సహకారం విజయవాడలో పెద్ద సంఖ్యలో ఫోర్జరీ సంతకాల ముఠాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. వీరికి కొన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సహకారం ఉంది. ఉన్నతాధికారుల సంతకాలను వీరు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేస్తున్నారు. ఆయా కార్యాలయాల ముద్ర (రబ్బర్ స్టాంపు)లను కూడా వీరు తయారుచేయించి ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల్లోని కొందరు సిబ్బంది సహకారం కూడా ఉన్నట్లు వినికిడి. ఉన్నతాధికారుల నమూనా సంతకాలను అందజేయడంతోపాటు తమ సంస్థ ఉపయోగించే ముద్రల వివరాలను కూడా ఈ ముఠాల సభ్యులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు భారీగానే ప్రతిఫలం పొందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం విజయవాడను రాజధానిగా చేస్తారని ప్రచారం జరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా కొనుగోళ్లు, అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో ఫోర్జరీ ముఠాలు రంగప్రవేశం చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారుచేసే అవకాశం ఉందనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా మోసాలు భారీగా జరిగేవి. ఇప్పుడీ ముఠాల దృష్టి నగరంపై పడినట్లు తెలుస్తోంది. కూపీ లాగుతున్న పోలీసులు ఫోర్జరీ ముఠాల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా కిడ్నీ దానం కోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కుటుంబ ధ్రువీకరణ పత్రం తయారు చేశారంటూ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట కూడా కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే తరహా మోసం జరిగింది. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడు నెలల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి చెలామణి చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిట్టినగర్‌కు చెందిన ఆ యువకుడు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి ఆయా కంపెనీల ముద్రలను కూడా వేసి సొమ్ము చేసుకున్నాడు. గత ఏడాది చివర్లో గాంధీనగర్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసిన ముఠా సభ్యులను రిజిస్ట్రార్ ఫిర్యాదుతో గవర్నరుపేట పోలీసులు అరెస్టు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముఠాల ఆచూకీపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. జి.కొండూరు మండల తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పాస్‌పుస్తకాలు పొందిన ముగ్గురిని కూడా అరెస్ట్‌చేశారు. -
ప్రై‘వేటు’ దోపిడీ
సెలవులు, ఎన్నికల నేపథ్యంలో... కాస్ట్లీగా మారిన ప్రయాణం ఆర్టీసీ అరకొర ఏర్పాట్లు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్న ట్రావెల్స్ పట్టనట్టు వ్యవహరిస్తున్న రవాణా శాఖ నాంపల్లి, అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సెలవులు, ఎన్నికలు ఒక్కసారిగా రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పరిమితమైన రైళ్లు.. ఆర్టీసీ బస్సులు చాలని పరిస్థితిలో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నగరం నుంచి చెన్నై, ముంబై, వైజాగ్, బెంగ ళూరు, నాగ్‌పూర్, తిరుపతి, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లలో బెర్త్‌లు లభించకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. బెంగళూరు, చెన్నైలకు పెరిగిన రద్దీ బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఆదివారం ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అధికారులు అదనపు బస్సులు నడిపారు. సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు, చెన్నైలకు ఆర్టీసీ 32 బస్సులను నడుపుతుంది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ఆదివారం 30 అదనపు బస్సులను నడిపారు. సీమాంధ్రకు 600 అదనపు బస్సులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతానికి 600 అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నందున ఓటు వేసేందుకు నగరం నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులను నడిపనున్నట్లు ఎంజీబీఎస్ ఏటీఎం -1 ఇ.వి.సత్యనారాయణ తెలిపారు. ప్రతినిత్యం ఎంజీబీఎస్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు నడిపే 720 షెడ్యూల్డ్ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే సీమాంధ్ర వైపు వెళ్లే బస్సుల్లోని సీట్లన్నీ ముందుగానే రిజర్వు కాడవంతో.. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించిందని ఆయన వెల్లడించారు. -
చిన్నపాటి అలక్ష్యం...ప్రాణాలు ఫణం
ప్రమాదం అంచున ప్రయాణాలు నిత్యం రక్తమోడుతున్న రోడ్లు మొక్కుబడిగా రహదారి భద్రతా వారోత్సవాలు ప్రయాణికులను వదిలి పాఠశాల్లో అవగాహనా! చిన్నపాటి అజాగ్రత్త పెను ప్రమాదానికి దారితీస్తోంది.. ఏమవుతుందిలే అనే అలక్ష్యం నిండు ప్రాణాలను కబళిస్తోంది.. తొందరగా గమ్యానికి చేరాలన్న ఆతృత కాటికి తీసుకుపోతోంది.. అన్నీ తెలిసినా నిత్యం ప్రమాదం అంచునే మనిషి ప్రయాణం సాగుతోంది.. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పొరపాటు నిండు జీవితానికి గ్రహపాటుగా మారుతున్న వైనంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.. ఈ దిశగా ఇటీవల చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాలు దోహదం చేస్తాయా అంటే అవీ మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి. సాక్షి, మచిలీపట్నం/ నందిగామ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన కీలక విషయాలపై వారు దృష్టి సారించటం లేదు. ప్రమాదాల నివారణ కోసం వాహనచోదకులు, ప్రయాణికుల్లో చైతన్యం నింపాల్సి ఉండగా, పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు, ప్రమాదానికి గురైన ఒక కారును నమూనాగా ఊరేగించడం, ప్రమాదాల కారణాలను విద్యార్థులకు వివరించడంతో సరిపెడుతున్నారు. విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన మంచిదే అయినా కీలకమైన ప్రాంతాల్లో ప్రమాద కారణాలు గుర్తించి వాటిపై అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం జరగడంలేదు. ప్రమాదం అంచున ప్రయాణాలు... గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలపై ప్రయాణం చేసేవారు నిత్యం ప్రమాదం అంచునే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణించటం, బైక్‌లపైనా అధిక బరువు (లగేజీ)తో ప్రయాణాలు కొనసాగించడం తరచూ కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ఆటోలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆటోవాలాలు ఆదాయం కోసం పరిమితి కంటే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. నలుగురు ఎక్కి ప్రయాణం చేయాల్సిన ఆటోలో ఏకంగా 30 మందిని కూడా ఎక్కిస్తున్నారంటే ఎంత ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండకపోవడం వల్లే ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణం చేస్తున్నామనేది పలువురి వాదన. ఇటువంటి వారికి రవాణా శాఖాధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సి ఉంది. చివరకు వారోత్సవాల్లో కూడా మొక్కుబడిగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహిస్తూ రవాణా శాఖాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గతంలో జరిగిన పలు పెద్ద ప్రమాదాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంతమేర ప్రమాదాలను అదుపుచేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నెత్తురోడుతున్న రోడ్లు.. జిల్లాలో గత ఏడాది కాలంలో పరిశీలిస్తే రోడ్లు నెత్తురోడాయి. గత ఏడాది ఆరంభం రోజునే గుడివాడ, మక్కపేట, కేసరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 2013 జనవరి 8న నూజివీడు, జి.కొండూరు, కలిదిండి ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. భోగి రోజైన జనవరి 13న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. జనవరి 15న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జనవరి 25న విజయవాడ, కంభంపాడు, భీమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మార్చి 3న తోట్లవల్లూరు, ఎ.కొండూరు, కంకిపాడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మార్చి 26న విస్సన్నపేట, కలిదిండిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతన పడ్డారు. మే 21న ఉంగుటూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట, మచిలీపట్నం రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. జూలై 6న ఉంగుటూరు, ముదినేపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. జూలై 7న మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడివాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ బత్తుల లక్ష్మణరావు, గుమ్మిడి ప్రతాప్‌లు ఇద్దరు మృతి చెందారు. జూలై 15న గుడివాడ, కంచికచర్ల, హనుమాన్‌జంక్షన్ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. జూలై 20న పామర్రు మండలం కనుమూరు చెక్‌పోస్టు వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఏఎస్సై ఎంవీవీ ప్రసాద్ (54) దుర్మరణం చెందారు. సెప్టెంబర్ 8న కలిదిండి, కంచికచర్ల, జగ్గయ్యపేట ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. సెప్టెంబర్ 22న పెనమలూరు, కైకలూరు ప్రాంతాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. నవంబర్ 9న కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే తొందరగా గమ్యం చేరాలనే ఆతృత, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అలక్ష్యం తదితర కారణాలతో ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటువంటి ప్రమాదాలను నిలువరించేందుకు ప్రజల్లో మరింత ఆవగాహన అవసరం. -
రవాణా శాఖను వేధిస్తున్న యార్డు కొరత
నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : జిల్లాలోని రవాణా శాఖకు సీజింగ్ యార్డు లేకపోవడంతో ఆ శాఖ అధికారులకు తిప్పలు తప్పడం లేదు. వాహన యజమానులు సైతం తమ వాహనాలు తుప్పు పడుతున్నాయని వాపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయం, ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయం జిల్లా కేంద్రంలోని భక్తవత్సలనగర్‌లో ఉన్నాయి. నిత్యం వెయ్యి నుంచి 1500 మంది వాహన యజమానులు వివిధ రకాల సేవ లు పొందుతుంటారు. ఈ కార్యాలయ ప్రాంగణంలోనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ తనిఖీ లు, వాహన ఫిట్నెస్ సంబంధించిన తనిఖీలు, డ్రైవర్ లెసైన్సు మంజూరుకు అవసరమైన తని ఖీలు నిర్వహిస్తుంటారు. డ్రైవింగ్ లెసైన్స్ తని ఖీలకు అవసరమైన టెస్ట్ ట్రాక్ ఉన్నప్పటికీ తనిఖీ అధికారి, సిబ్బంది ఉండేందుకు అవసరమైన గది లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నూతనంగా రిజిస్ట్రేషన్ కోసం ఎఫ్సీల కోసం నిత్యం వందలాది వాహనాలు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అయితే కార్యాలయ ఆవరణలో, సమీప ప్రాంతాల్లో సీజింగ్ వాహనాలు నిలిపి ఉండటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనాలను నిలిపేందుకు చోటు దొరకడం కష్టమవుతుంది. ఫిట్నెస్ కోసం మినీబైపాస్ రోడ్డులోనే వాహనాలను నిలపి వేయాల్సి వస్తోంది. సంబంధిత మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ అక్కడి వరకు వెళ్లి ఎఫ్‌సీలను జారీ చేయాల్సి ఉంటుంది. రోడ్డుపైనే ఎఫ్‌సీ తనిఖీలు నిర్వహించడంతో పైరవీలకు అవకాశమేర్పడుతుంది. జిల్లా వ్యాప్తంగా అక్రమ వాహనాలను ఎక్కడ పట్టుకున్నా రవాణా శాఖకు చెందిన సీజింగ్ యార్డులు ఉంచితే సంబంధిత వాహన యజమాని అపరాధ రుసుం, ఆలస్య రుసుం చెల్లించిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ ఇస్తే సంబంధిత సీజింగ్ యార్డులోని సెక్యూరిటీ విభాగానికి రిలీజింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చి వాహనాన్ని తీసుకు వెళ్లవచ్చు. జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించిన ఎంవీఐలు అక్రమ వాహనాలను పట్టుకుంటే వాటిని భద్రపరిచేందుకు అవస్థలు పడుతున్నారు. సమీపంలోని ఆర్టీసీ డిపోల్లో ఉం చేందుకు సంబంధిత అధికారులు అంగీకరించడం లేదు. ఇక కొన్ని పోలీస్ స్టేషన్లలో అయితే రవాణా శాఖ అధికారులు పట్టుకున్న వాహనాలను ఇక్కడ ఉంచుకోబోమని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. సుదూర ప్రాంతంలో సీజ్ చేసిన వాహనాన్ని సైతం సంబంధిత ఎంవీఐ సొంత పూచికత్తుపై సురక్షిత ప్రదేశంలో ఉంచాల్సి ఉం టుంది. దీంతో సంబంధిత ఎంవీఐ తన వద్ద ఉన్న ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ను కానీ హోంగార్డును గాని వాహనంతో పాటు పంపి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలోనే ఉం చాల్సి రావడంతో అధికారులు ఎక్కువ వాహనాలను తనిఖీ చేయలేక పోతున్నారు. శివారు ప్రాం తంలో ఒక ఎకరా స్థలం ప్రభుత్వం వద్ద నుంచి సేకరించుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకుంటే అధికారులకు ఇబ్బంది లేకుండా ఉండడమే కాకుండా వాహనాలకు భద్రత లభిస్తుందని పలువురు భావిస్తున్నారు.