
మూసి ఉన్న చిలుకూరు బాలాజీ దేవాలయం
మొయినాబాద్ (చేవెళ్ల): వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణహత్యకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాలపాటు ప్రదక్షణలు, దర్శనాలు పూర్తిగా నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణ చేయించారు. ‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు.
స్త్రీలకు రక్షణ కల్పించాలంటూ మొక్కతున్న భక్తులు
ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు.