షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
షాద్‌నగర్ టౌన్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆమెను దారుణంగా హత్యచేసిన ఉన్మాదులను వెంటనే ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పోటెత్తారు. వారిని తమకు అప్పగిస్తే ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతామంటూ ఆందోళన చేశారు. ఓ దశలో పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు స్టేషన్‌కు భారీగా చేరుకున్నారు. వేలాది మంది ఒక్కసారిగా తరలి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు.
లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు
పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో కొంతమంది పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. పలువురు నిరసనకారులు పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అరగంట తర్వాత మళ్లీ వారంతా స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని అదుపు చేయాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఠాణా ఎదుట ఏర్పాడు చేసిన బారికేడ్లను కూడా ఆందోళనకారులు తోసేసి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టాయి.
పోలీసు వాహనాల అడ్డగింత.. రాళ్లదాడి
ప్రియాంక హత్య కేసులోని నిందితులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తి పోలీసు వ్యాన్‌కు అడ్డుగా పడుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు మరోసారి లాఠీచార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. అనంతరం నిందితులను అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు షాద్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రజలు ఆందోళన విరమించారు.
చదవండి:
ముందే దొరికినా వదిలేశారు!
Comments
Please login to add a commentAdd a comment