మా కొడుకులను శిక్షించండి | Priyanka Reddy Murder Case : Accused Persons Families Worried | Sakshi
Sakshi News home page

మా కొడుకులను శిక్షించండి

Published Sun, Dec 1 2019 5:02 AM | Last Updated on Sun, Dec 1 2019 5:02 AM

Priyanka Reddy Murder Case :  Accused Persons Families Worried - Sakshi

చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ(గుడిగండ్ల)

నారాయణపేట/మక్తల్‌: ‘ఒక్కడు చేసిన తప్పుతో మా గ్రామం మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.. తప్పు చేసిన నిందితులను గ్రామంలోనే బహిరంగంగా ఉరితీయాలి’ అని ప్రియాంక హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు, జక్లేర్‌ గ్రామస్తులు పేర్కొన్నారు. ఘోరమైన తప్పిదానికి పాల్పడిన తమ కుమారులను కఠినంగా శిక్షించాలని నిందితుల తల్లులు అన్నారు. వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక హత్యను నిరసిస్తూ ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ స్వగ్రామమైన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌లో శనివారం గ్రామస్తులు, నిందితుల తల్లిదండ్రులతో కలసి రాస్తారోకో చేశారు. మిగతా నిందితుల గ్రా మం గుడిగండ్ల నుంచీ ప్రజలు, నిందితుల కుటుంబీకులు ఇక్కడికొచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.  

నన్ను.. నా కొడుకును శిక్షించండి 
‘నాకు ఆపరేషన్‌ అయింది.. నేను ఎక్కువ రోజులు బతకను. నా కొడుకు ఇలాంటి పనిచేశాడంటే నమ్మలేకపోతున్నా. నన్ను, నా కొడుకును శిక్షించండి’అంటూ ప్రియాంకారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ తల్లి మౌలానాబీ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఊళ్లో వారంతా నీ కొడుకు ఈ పనిచేశాడంటా.. అని మాట్లాడుతుంటే వినలేకపోతున్నా. నాకు ఒక కూతురు, భర్త ఉన్నారు. ఆ పిల్ల కోసం బతకాలనే ఆశ ఉంది. అన్నకు ఏం అయిందని బిడ్డ అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమైతలేదు. నా పిల్లకు దోస్తులే ధైర్యం ఇస్తూ బాధపడొద్దని చెబు తున్నారు. గుండెనిండా బాధ ఉంది. కంటికి కునుకులేకుండాపోతుంది మాకు’ అని విలపించింది. 

నా కొడుకును కాల్చేయండి 
‘ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకునూ అలాగే కాల్చిచంపండి’ అంటూ ప్రియాంక హత్య కేసులో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ కన్నీరుపెడుతూ చెప్పింది. ‘ఏ తల్లికైనా కడుపుకోతనే.. ఆ తల్లి అయినా.. నేనైనా బిడ్డను తొమ్మిది నెలలు మోసి కన్నవాళ్లమే. నాకూ ఆడపిల్లలున్నారు.. నా కొడుకు ఇలాంటి పాడుపని చేస్తాడనుకోలేదు. పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ఎం దుకంటే.. మళ్లీ పంపిస్తామన్నారు. మధ్యాహ్నం తర్వాత ఊళ్లో కొంతమంది నీ కొడుకు ఒక అమ్మా యిని ఇలా చేశాడంటా.. అని చెబితే విషయం తెలిసింది.

ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరు వింటారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నా కొడుకు లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నడు సర్దుకుపోయాం. వాడికి కిడ్నీ రోగం ఉంది. లారీడ్రైవర్‌ పని బంద్‌ చేయమని చెప్పాం. కానీ, వినకుండా జక్లేర్‌ ఆరిఫ్‌ మాట విని వెళ్లిపోయిండు. ఇప్పుడు ఊరంతా మావోడి గురించే మాట్లాడుతుంటే నేను ఏమని చెప్పనయ్యా.. అందరికీ ఒకటే బాధ’అంటూ తన కొడుకు ఇలాంటి పనిచేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ ఘటన విని తన భర్త చావడానికి ప్రయత్నించాడని.. ఎవరు చేసినా పాపం పాపమే కదా.. శిక్ష అనుభవించాల్సిందే అంటూ బాధ పడింది.  

నా కొడుకును మోసం చేసిండ్రు 
తన కొడుకు అలాంటివాడు కాదని నిందితుడు శివ తల్లి మణెమ్మ పేర్కొంది. ‘కొడుకు లారీ క్లీనర్‌ పని మానేయమని చెబితే, జీతం తీసుకువస్తానని చెప్పి కంపలో పడిండు. నా కొడుకును మోసం చేసిం డ్రు. అసలే వాడు అప్పుడప్పుడు ఎద పట్టుకొని రక్తం కక్కేవాడు. వద్దురా ఈ లారీల మీద పోవద్దని చెప్పినా వినకుండా నవీన్‌ ఫోన్‌ చేస్తే వెళ్లిపోయా డు. పెద్ద కొడుకు రాజశేఖర్‌ మట్టి పనిచేస్తూ బతుకుతలేడా.. నీవు ఊర్లో ఉండి కూలీ నాలీ చేసి బతుకురా అంటే వినకుండా పోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నడు’ అని వాపోయింది.  

మొగుడు అలా.. కొడుకు ఇలా.. 
‘నవీన్‌ చిన్నగ ఉన్నప్పుడే నా మొగుడు ఎల్లప్ప సచ్చిపోయిండు. కొడుకు పెద్దగా అయ్యిండు సంసారం సాగదీస్తాడనుకుంటే ఈ పాడు పని చేసి జైలుపాలాయే’అని నిందితుడు నవీన్‌ తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది. ‘వాడు చదివింది ఏడో తరగతే. చదువు అబ్బలేదు. నా కొడుకుకు జక్లేర్‌ ఆరిఫ్‌నే మోటార్‌సైకిల్‌ ఇప్పించిండు. ఆరిఫ్‌ ఎప్పుడు ఫోన్‌ చేస్తే అప్పుడు ఉరికేవాడు. ఆరిఫ్‌  వల్లే లారీ డ్రైవర్‌గా హైదరాబాద్‌కు వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పేవాడు. యాక్సిడెంట్లు అవుతుండటంతో ఆరు నెలలుగా లారీ డ్రైవర్‌గా పని బంద్‌ చేయించా. మొన్ననే సోమవారం పాషా ఫోన్‌ చేసి లారీ లోడ్‌ ఖాళీ చేసి వద్దాం రా అంటూ చెప్పడంతో వెళ్లిపోయాడు. సోమవారం వెళ్లాడు.. గురువారం రాత్రి వచ్చి పడుకున్నాడు. తెల్లారేసరికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు’అని లక్ష్మి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement