ప్రొ.సాయిబాబాను విడుదల చేయాలి
విరసం నేత వరవరరావు డిమాండ్
న్యూశాయంపేట: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను విడుదల చేయూలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. బెయిల్ రద్దు చేయడం న్యాయసూత్రాల ఉల్లంఘనే అని అన్నారు. శనివారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయిబాబా బెయిల్‌ను నాగపూర్ హైకోర్టు బెంచ్ రద్దు చేసిందని.. శుక్రవారం రాత్రి ఆయనను తిరిగి నాగపూర్ సెంట్రల్ జైలుకు పంపించారన్నారు. జైలుకు పంపడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచి ఈనెల 31 వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను నాగపూర్ హైకోర్టు సింగిల్ బెంచి జడ్జి రద్దు చేయడం.. తనకన్నా పైన ఉండే ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాన్ని బేఖాతరు చేయడమేనని ధ్వజమెత్తారు.
ఇంతటితో ఊరుకోకుండా ప్రభుత్వం ఓ పత్రికలో సాయిబాబాను యుద్ధఖైదీగా పేర్కొంటూ ఆయనను విడుదల చేయాలని రాసిన రచయిత్రి అరుంధతిరాయ్ రచనపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసు ఇవ్వడం అవాంచనీయమే కాకుండా.. భావప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం సంకెళ్ళు వేయడమేనని అన్నారు. ఈ రెండు చర్యలపై ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చండీయూగం రాజ్యాంగ ఉల్లంఘన
సీఎం కేసీఆర్ వ్యక్తిగత చండీయాగం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మారడం రాజ్యాంగ ఉల్లంఘన అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విరసం నేత వరవరరావు అన్నారు. ప్రజల సొమ్ముతో అధికార దుర్వినియోగం చేయడాన్ని లౌకిక ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో టీపీఎఫ్ నాయకులు రమాదేవి, వీరబ్రహ్మచారి, అభినవ్, నల్లెల రాజయ్య, పి.రమేష్‌చందర్, బదావత్ రాజు పాల్గొన్నారు.