భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటానికి అండగా ఉంటామని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం నిర్వహించిన చేనేత శంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదు జిల్లాల్లో చేపట్టిన చేనేత చైతన్య బస్సుయాత్ర ద్వారా లక్ష మగ్గాలు, రెండు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు సైతం చేతి వృత్తులను కాపాడుకుంటున్నాయన్నారు. చేనేత రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
సబ్సిడీపై ముడిసరుకులు, మగ్గాలు ఇవ్వాలని.. నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వ్యవసాయం, కులవృత్తులు బతికితేనే తెలంగాణ బతుకతదనిది పేర్కొన్నారు. ఉన్నచోట బతుకుదెరువు దొరకాలని, అది కూడా ఇజ్జత్‌గా బతుకాలన్నారు. చేనేత దినోత్సవం రోజున అధికారులు, టీవీ యాంకర్లు, ప్రజాప్రతినిధులందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేసి.. చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు జేఏసీ తరఫున కృషి చేస్తామన్నారు. ఏ ఒక్క చేనేత కార్మికుడు నిరాశ చెందొద్దని.. వారికి జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హామీలను పట్టించుకోని ప్రభుత్వం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ వస్తే చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని భావించినా.. అది జరగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2016-17బడ్జెట్‌లో చేనేతకు ఒక్క రూపాయి కూడ కేటాయించకపోవడం దారుణమన్నారు. చేనేత, జౌళిశాఖను వేరు చేసి.. వేర్వేరుగా కేటాయింపులు చేస్తామని, చేనేత పాలసీని ప్రకటిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.
చేనేత కార్మికులకు నిధులు, హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని బీజెపీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే ఎంవీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. అవసరమైతే కేంద్రమంత్రి సంతోష్‌గంగ్వార్ కలిసి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మానవాళితోనే చేనేత పుట్టిందని, పాలకులు ఎందరూ మారిన, చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జోలపట్టయినా సరే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్‌కు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల గోస కన్పిస్తలేదని విమర్శించారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలుగా ప్రజాసమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుదామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు గానీ.. చేనేత కార్మికులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అనిల్‌కుమార్, తెలంగాణ చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ కూరపాటి రమేశ్, గర్ధాస్ బాలయ్య మాట్లాడారు.
కార్యక్రమానికి ముందుగా ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలిండియా హ్యాండ్లూమ్‌బోర్డు సభ్యుడు కర్నాటి ధనుంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు గూడురు నారాయణరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, తడక యాదగిరి, కల్పనాకుమారి, కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి, భారత వాసుదేవ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, కర్నాటి శ్రీనివాస్, మాచర్ల మోహన్‌రావు, గోలి యాదగిరి, గడ్డం జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.
చేనేత నేత కార్మికులకు అండగా ఉంటాం...
Published Sat, Jul 2 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement