పంటల బీమాపై ప్రచారం చేయండి
జిల్లా వ్యవసాయాధికారులకు పోచారం ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : పంటల బీమా ప్రాధాన్యం, గడువు తేదీలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల్లో రుణం పొందిన, పొందని రైతులు పంటల బీమా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసార«థి, కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే 18వ తేదీ నాటికి రైతు సమగ్ర సర్వే నివేదికను తమకు పంపాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని, ప్రణాళికాబద్ధంగా రైతులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. రుణమాఫీ సొమ్ము ఇప్పటివరకు రైతు ఖాతాల్లో జమ చేయకుంటే తక్షణమే జమ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపరిహారం రైతు ఖాతాకు చేరేలా చూడాలని అన్నారు.
సూక్ష్మ సేద్యంలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం...
సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ కల్పిస్తున్నందున దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. ఎప్పటికప్పుడు పంట ప్రణాళిక, పంటల నిర్వహణకు సంబంధించిన సూచనలను సమయానుకూలంగా రైతులకు అందించాలని సూచించారు. శనివారం ఆయన ఉద్యానశాఖ జిల్లా అధికారులు, సూక్ష్మ సేద్య కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. సమీక్షలో ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.