రైతు యూనిట్‌గా పంటల బీమా
• అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఒప్పుకుంది
• ఈ సీజన్ నుంచే అమలు: పోచారం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌లు చేసిన తీర్మానం ప్రకారం రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆ మేరకు ఈ సీజన్ నుంచే వ్యక్తిగతంగా పంట నష్టపోతే రైతుకు బీమా పరిహారం అందుతుందన్నారు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి వెనుకాడవద్దని విజ్ఞప్తి చేశారు. వడగళ్లు, అకాల వర్షాలు, కోత తర్వాత పంటకు నష్టం వాటిల్లితే రైతు యూనిట్‌గా పంటల బీమా అందుతుందన్నారు.
ఆదర్శ రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో రైతు దినోత్సవం జరిగింది. పోచారం మాట్లాడుతూ... రైతు యూనిట్‌గా పంటల బీమాకు కేంద్రం అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వ ఘనతేనన్నారు. అలోవేరా, ఉసిరి వంటి ఔషధ పంటలు పండించడానికి... వాటిని కొనుగోలు చేయడానికి పతంజలి సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ మేరకు రాందేవ్‌బాబాతో ఎంపీ కవిత చర్చలు జరిపారన్నారు. అలోవేరా, ఉసిరి ప్రాసెసింగ్‌కు హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పతంజలి ముందుకు వచ్చిందన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నా రు. రాబోయే రోజుల్లో రైతులకు 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తామన్నారు.
వెయ్యి ఏఈవో పోస్టుల భర్తీ
కొత్తగా వెయ్యి వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీ చేపడుతామని పోచారం వెల్లడించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిందని, కోర్టు తదుపరి ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తామన్నారు. యాసం గిలో 12లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా... ప్రస్తుతం తమ వద్ద 9 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సూక్ష్మసేద్యం కోసం రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని... వారందరికీ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం నాబార్డు రుణం రూ.874 కోట్లు సహా మొత్తం రూ.1,092 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యాన సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలనగానే రాజకీయ విమర్శలు పెరిగాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తిట్టుకునేది.. కొట్టుకునేది ఏమైనా ఉంటే బయటే చూసుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు మంత్రి అవార్డులు అందజేశారు. ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, రసమయి బాలకిషన్, కర్నె ప్రభాకర్, ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.