మేనేజ్‌మెంట్ల వారీగా పదోన్నతులు! | Promotions by the management! | Sakshi
Sakshi News home page

మేనేజ్‌మెంట్ల వారీగా పదోన్నతులు!

Published Wed, Jan 30 2019 3:29 AM | Last Updated on Wed, Jan 30 2019 3:29 AM

Promotions by the management! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు మేనేజ్‌మెంట్ల వారీగా పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఏళ్ల తరబడి నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్‌ అంశం తెరమరుగైంది. పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన సవరణ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో దానికోసం పట్టుపడుతున్న ప్రధాన సంఘమైన పీఆర్‌టీయూ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి వచ్చిన పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.  

ఏకీకృత సర్వీసు రూల్స్‌ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినా, హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లకు వేర్వేరుగా, ఎవరి మేనేజ్‌మెంట్లలో వారికే పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, ఆ అంశాన్ని పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఇందుకోసం 1,09,024 మంది టీచర్లు (ప్రభుత్వ టీచర్లు 10,817 మంది, పంచాయతీరాజ్‌ టీచర్లు 98,207 మంది) వేచి చూస్తున్నారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీంతో పదోన్నతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మేనేజ్‌మెంట్ల వారీగా ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌అసిస్టెంట్లకు హెడ్‌ మాస్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. నెలకు రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం వారు 11,363 మంది ఉన్నారని, అందులో 7,010 మంది ప్రస్తుతం పనిచేస్తుండగా, 4,353 మంది రిటైర్‌ అయ్యారని వివరించారు. ఇందుకు రూ. 54 కోట్లు అవుతుందని సీఎంకు వివరించారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు 10 నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లించాలని కోరారు. టీచర్లకు 3 నెలల మెటర్నిటీ లీవ్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ అమలు చేయాలని, మోడల్‌ స్కూల్‌ టీచర్లకు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని వారు సీఎంకు వివరించారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిచడంతో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు వెల్లడించారు.    

ఎంఈవో పోస్టులన్నీ మాకే ఇవ్వండి: జీటీఏ 
మేనేజ్‌మెంట్ల వారీగా పదోన్నతుల కోసం సీఎం కేసీఆర్‌ను పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తమ మేనేజ్‌మెంట్‌ పరిధిలో ఉన్న పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ పరిధిలోని ఎంఈవో, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్, ఉప విద్యాధికారులు, డైట్‌ లెక్చరర్లు, బీఎడ్‌ లెక్చరర్లు, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్‌ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ టీచర్లను మాతృశాఖలకు పంపించాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement