సాక్షి, సిటీబ్యూరో: ‘‘ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాలి, కబ్జా చేశారని ల్యాండ్ గ్రాబింగ్ (ఎల్‌జీ) కోర్టులో తీరిగ్గా కేసులు వేయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. కబ్జా గురించి మీకు తెలిసిన వెంటనే మరో ఆలోచనకు తావివ్వకుండా దాన్ని కొట్టేయండి’’అని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఎస్‌కె సిన్హా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూముల స్థితిగతులను మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ మాట్లాడుతూ.. కబ్జాదారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చే విషయంలో వీఆర్వోలు, తహశీల్దార్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నోటీసులోని వివరాల ఆధారంగానే కేసుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయన్నారు. పలుకేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడానికి చూపిన కారణాలు బలంగా లేకపోవడమేనన్నారు.
ప్రతిష్టను పెంచండి
రెవెన్యూలో విధుల పట్ల నిబద్ధత, సమయ పాలన తోనే సత్ఫలితాలను సాధించగలమని సీసీఎల్‌ఏ అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం తీరు ఉండాలని ఆకాంక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం.. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంపై సమీక్షిస్తూ.. కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని ఇంచార్జ్ డిప్యూటీ డెరైక్టర్ రాంరెడ్డిని సీసీఎల్‌ఏ ప్రశ్నించారు.
ఇంచార్జ్ డీడీ తటాపటాయిస్తుండడం పట్ల సీసీఎల్‌ఏ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యాలయంలో ఏ కేటగిరి సిబ్బంది ఎంతమంది ఉన్నారో తెలియకుండానే ఇక్కడ పనిచేస్తున్నారా.. అంటూ మండిపడ్డారు. కీలకమైన సమావేశానికి సర్వే విభాగం జాయింట్ డెరైక్టర్, కమిషనర్లు రాకపోవడంపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని సీసీఎల్‌ఏ పేర్కొన్నారు.
సర్వేయర్లు అవసరం : కలెక్టర్ మీనా
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు 11 మంది సర్వేయర్లు, 18మంది డిప్యూటీ సర్వేయర్లు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు సర్వేయర్లు, 8 మంది డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం.కె.మీనా సీసీఎల్‌ఏ దృష్టికి తెచ్చారు. అలాగే ప్రభుత్వ స్థలాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికై రూ.5.50 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.మూడు కోట్లే మంజూరయ్యాయని తెలిపారు.
ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకునేప్పుడు అవుతున్న ఖర్చులను శాఖాపరంగా ఇప్పించాలని, పెరిగిన రేట్ల ప్రకారం వెహికల్స్ రెంటల్ చార్జీలను మంజూరు చేయాలని పలువురు తహశీల్దార్లు సీసీఎల్‌ఏను కోరారు. సీసీఎల్‌ఏ స్పందిస్తూ.. మరో ఆరుగురు సర్వేయర్లను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ త్వరితగతిన కాంపౌండ్ వాల్స్ నిర్మించడం పట్ల సీసీఎల్‌ఏ హర్షం వ్యక్తం చేశారు. కబ్జాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
Published Fri, Jul 4 2014 12:52 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
Advertisement
Advertisement