Survey and Land Records
-
రీసర్వేలో మరో మైలురాయి.. వెయ్యి గ్రామాల్లో భూములకు హద్దులు
సాక్షి, అమరావతి: భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేపట్టిన జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో ప్రభుత్వం మరో మైలురాయి అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారానికి 1,000 గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా ముగించి.. దీనికి సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల 509 ఎకరాలను రీసర్వేలో కొలిచి కొత్త సరిహద్దులు నిర్ణయించారు. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేట్ ఏజెన్సీలు డ్రోన్ సర్వే చేసి ఇచ్చిన చిత్రాలు (ఓఆర్ఐ), భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే పూర్తి చేశారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వచ్చినప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్లతో మళ్లీ సర్వే చేశారు. రైతుల ఆమోదంతో సరిహద్దులు నిర్ధారణ పూర్తయ్యాక పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారవుతున్నాయి. అత్యధికం శ్రీకాకుళం.. అత్యల్పం అల్లూరి జిల్లా జిల్లాల వారీగా గ్రామాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 193 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 89, వైఎస్సార్ జిల్లాలో 72, నెల్లూరు జిల్లాలో 67, తిరుపతి జిల్లాలో 62 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. విస్తీర్ణ పరంగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,04,018 ఎకరాలను (58 గ్రామాలు) కొలిచి సర్వే పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 89,475 ఎకరాలు (28 గ్రామాలు), నెల్లూరు జిల్లాలో 78,102 ఎకరాలు (67 గ్రామాలు) కొలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 2 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. గుంటూరు జిల్లాలో 5 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామాల్లో కొత్త రికార్డులు తయారయ్యాయి. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం– భూకమతాల మ్యాప్), ఆర్ఎస్ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. కొత్త హద్దులు, తాజా భూయజమానుల వివరాలతో ఈ రికార్డులు రూపొందాయి. రీసర్వే పూర్తయిన కొత్త భూముల రికార్డులు అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో ఇకపై ఎలాంటి భూసంబంధిత పనులకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. భూ యజమానులు ఎక్కడ నుంచైనా రికార్డులను సరిచూసుకోవచ్చు. భూ యజమాని అనుమతి లేకుండా, అతనికి తెలియకుండా భూమి రికార్డులలో ఎలాంటి మార్పు చేయలేని విధంగా భూ సమాచార వ్యవస్థను రీసర్వే ద్వారా తయారు చేస్తున్నారు. రీసర్వే వేగంగా జరుగుతోంది రాష్ట్రంలో భూముల రీసర్వే వేగం పుంజుకుంది. సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. మొదటి దశలో 5,300 గ్రామాలకు 4,600 గ్రామాల్లో రీసర్వేలో మొదట చేపట్టే డ్రోన్ ఫ్లైయింగ్ (డ్రోన్లతో కొలత) పూర్తయింది. సెప్టెంబర్ నాటికి మొదటి దశ అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తవుతుంది. వర్షాలు తగ్గాక ఇంకా వేగంగా సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – సిద్ధార్థ్ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
తలుపులు మూసి.. పరీక్ష రాయించి..
నిజామాబాద్ నాగారం: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో పదోన్నతుల కోసం ఆదివారం డిపార్ట్మెంటల్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో 23 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఆరు నెలల క్రితమే నిర్వహించారు. అప్పట్లో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే మాస్ కాపీయింగ్ జరిగిందంటూ ‘సాక్షి’లో ‘చూచిరాతలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి చూచిరాతలకు సహకరించారంటూ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ పరీక్షను రద్దు చేశారు. ఆరు నెలల క్రితం రద్దయిన పరీక్షను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. 24 మంది అభ్యర్థులకు గాను 23 మంది పరీక్ష రాశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ ఏడీఈ కిషన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. శాఖ సూపరింటెండెంట్ వెంకటేశం, సెక్షన్ క్లర్క్ స్వప్న పరీక్షల నిర్వహణ బాధ్యత నిర్వర్తించారు. అయితే ఈసారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పని దినాలలో కార్యాలయంలోని కిటికీ తలుపులు తెరిచి ఉంటాయి. కానీ పరీక్ష సమయంలో కిటికీలను మూసి ఉంచారు. అభ్యర్థులకు దోమలు కుట్టుతున్నాయంటూ ఆలౌట్ ఫాస్ట్ కార్డులను తెప్పించారు. పరీక్ష జరుగుతున్నంత సేపు కిటికీల తలుపులు మూసి ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించలేదు.. ఈ పరీక్ష రాస్తున్న ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యంగా ఆయా మండలాల్లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు ఇతర మండలాల్లో పోస్టింగ్ వచ్చినా.. కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరీక్ష పాసైతే డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు లభిస్తాయి. మండలాల్లో పని చేయని వారికి పదోన్నతుల పరీక్షకు అనుమతించడం సబబు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆ ఇద్దరు!
►ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత హరీష్, శరత్పైనే ►90 శాతం వక్ఫ్, దేవాదాయ భూములు పరాధీనం ►33 వేల ఎకరాలున్నా ‘వక్ఫ్’ ఆదాయం రూ.16 వేలే.. ►లక్షలాది ఎకరాల శిఖం భూములు మాయం ►ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవుళ్లు ►సీఎం ప్రకటనతో భూముల స్వాధీనానికి కసరత్తు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గొలుసుకట్టు చెరువులు.. లక్షల ఎకరాల సర్కారీ భూములు.. మెతుకుసీమ ఆస్తులు. చెరువు నిండి చెలక పారితే.. భూమి శిస్తులతో ప్రభుత్వ ఖజానా కళకళలాడేది. నిజానికి తెలంగాణ వారసత్వ సంపద కూడా ఇవే. కాని ఇప్పుడా వైభవం లేదు. కాలంతో పాటే చెరువులు, కుంటలు, శిఖం భూములు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. చెరువు శిఖం భూముల నుంచి ప్రభుత్వానికి ‘దమ్మిడీ’ ఆదాయం లేదు. రాష్ట్రంలోనే ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆస్తులున్న జిల్లాలో నెల రాబడి కేవలం 16,500 రూపాయలే. ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొలుసుకట్టు చెరువుల పునర్నిర్మాణం, ఆక్రమిత భూముల స్వాధీనం సవాల్‌గా మారింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం, కేసీఆర్ సొంత జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు ఆక్రమణకు గురై ఉండటం అటు మంత్రి హరీష్‌రావుకు, ఇటు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు ఓ సవాల్‌గా మారింది. అబ్బో.. ఎంత భూమో..! జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 23 వేల ఎకరాల వక్ఫ్ భూములున్నట్లు ఇటీవల ప్రభుత్వం జరిపిన ప్రాథమిక సర్వేలో బయటపడింది. ఇందులో 99 శాతం భూమి కబ్జా అయింది. వీటికి సరైన రికార్డు లేకపోవడం, ఆస్తులు రెవెన్యూ అధికారుల అజమాయిషీలో కాకుండా ముతావలీల చేతిలో ఉండటంతో సులువుగా ఆక్రమణకు గురయ్యాయి. దాదా పు 20 వేల ఎకరాలకు పైగా ఉన్న దేవాదాయ భూములు చివరకు 3,651 ఎకరాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 180 దేవాలయాల కింద 3,651 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు దేవాదాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత భూమి కబ్జా అయిందనే సమాచారం అధికారుల వద్ద లేదు. 6,789 చెరువుల కింద 1,03,468.14 ఎకరాల శిఖం భూమి ఉంది. చెరువు ఎఫ్టీఎల్ భూములను కలుపుకుంటే ఇది 2.5 లక్షల ఎకరాలకు మించి ఉంటుంది. అన్ని రకాల భూములను కలుపుకుంటే జిల్లాలో 3,60,381.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ట్లు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో 60 శాతం భూమి ‘వైట్ కాలర్’ దోపిడీదారుల గుప్పిట్లో పడి నలిగిపోయింది. వేల ఎకరాల భూములు తిరిగి రావాలంటే జిల్లా భౌగోళిక స్వరూపం, భౌతిక పరిస్థితులతో పాటు రెవెన్యూ రికార్డులు, భూ సర్వే మీద బాగా పట్టున్న అధికారులు అవసరం. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు జిల్లా భౌగోళిక పరిస్థితులపై మంచి పట్టుంది. హరీష్‌కు సవాలే...! జిల్లా ఇన్చార్జి మంత్రిగా హరీష్ గొలుసుకట్టు చెరువుల మీద ద ృష్టి సారించారు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణ సంస్కృతిలో భాగమంటున్న హరీష్ .. అడ్డంకులను అధిగమించి చెరువుల పునర్నిర్మాణం చేస్తామని అంటున్నారు. ప్రతి చెరువును రక్షించి తీరుతామంటున్నారు. చెరువుల పూడికతీత పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై సర్వే చేయించినట్లు సమాచారం. పటాన్‌చెరులోని 9 చెరువు పనుల్లో జరిగిన అక్రమాలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆక్రమించిన వక్ఫ్ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులు ఎంతటి పెద్దవాళ్లయినా వదలబోమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే ప్రకటించిన మంత్రి, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే వక్ఫ్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేసి ఆక్రమణదారులకు బలమైన సంకేతాలు పంపించారు. శరత్‌కు సాధ్యమేనా? ఆక్రమిత భూముల పరిరక్షణకు రెవెన్యూ, సర్వే, భూ రికార్డులే ఆధారం. ఈ రికార్డులపై మంచి పట్టున్న అధికారిగా శరత్‌కు గుర్తింపు ఉంది. ప్రభుత్వ భూముల కోసం ఒక ప్రత్యేక ఫార్ములా రూపొందించి, దాని ఆధారంగా గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిని మొత్తం 15 కేటగిరీలుగా విభజన చేశారు. ఏ కేటగిరీలో ఎంత భూమి ఉందో స్పష్టంగా రికార్డులు తయారు చేసిపెట్టారు. నిజానికి ప్రభుత్వ భూమి ఎక్కడ ఎంత ఉంది? ఎవరి ఆధీనంలో ఉందో శరత్‌కు తెలిసినంతగా ఇతరులకు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన సేవలను వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు యోచిస్తున్నట్టు సమాచారం. -
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
సాక్షి, సిటీబ్యూరో: ‘‘ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాలి, కబ్జా చేశారని ల్యాండ్ గ్రాబింగ్ (ఎల్జీ) కోర్టులో తీరిగ్గా కేసులు వేయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. కబ్జా గురించి మీకు తెలిసిన వెంటనే మరో ఆలోచనకు తావివ్వకుండా దాన్ని కొట్టేయండి’’అని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఎస్కె సిన్హా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూముల స్థితిగతులను మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ.. కబ్జాదారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చే విషయంలో వీఆర్వోలు, తహశీల్దార్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నోటీసులోని వివరాల ఆధారంగానే కేసుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయన్నారు. పలుకేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడానికి చూపిన కారణాలు బలంగా లేకపోవడమేనన్నారు. ప్రతిష్టను పెంచండి రెవెన్యూలో విధుల పట్ల నిబద్ధత, సమయ పాలన తోనే సత్ఫలితాలను సాధించగలమని సీసీఎల్ఏ అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం తీరు ఉండాలని ఆకాంక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం.. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంపై సమీక్షిస్తూ.. కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని ఇంచార్జ్ డిప్యూటీ డెరైక్టర్ రాంరెడ్డిని సీసీఎల్ఏ ప్రశ్నించారు. ఇంచార్జ్ డీడీ తటాపటాయిస్తుండడం పట్ల సీసీఎల్ఏ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యాలయంలో ఏ కేటగిరి సిబ్బంది ఎంతమంది ఉన్నారో తెలియకుండానే ఇక్కడ పనిచేస్తున్నారా.. అంటూ మండిపడ్డారు. కీలకమైన సమావేశానికి సర్వే విభాగం జాయింట్ డెరైక్టర్, కమిషనర్లు రాకపోవడంపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని సీసీఎల్ఏ పేర్కొన్నారు. సర్వేయర్లు అవసరం : కలెక్టర్ మీనా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు 11 మంది సర్వేయర్లు, 18మంది డిప్యూటీ సర్వేయర్లు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు సర్వేయర్లు, 8 మంది డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం.కె.మీనా సీసీఎల్ఏ దృష్టికి తెచ్చారు. అలాగే ప్రభుత్వ స్థలాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికై రూ.5.50 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.మూడు కోట్లే మంజూరయ్యాయని తెలిపారు. ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకునేప్పుడు అవుతున్న ఖర్చులను శాఖాపరంగా ఇప్పించాలని, పెరిగిన రేట్ల ప్రకారం వెహికల్స్ రెంటల్ చార్జీలను మంజూరు చేయాలని పలువురు తహశీల్దార్లు సీసీఎల్ఏను కోరారు. సీసీఎల్ఏ స్పందిస్తూ.. మరో ఆరుగురు సర్వేయర్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ త్వరితగతిన కాంపౌండ్ వాల్స్ నిర్మించడం పట్ల సీసీఎల్ఏ హర్షం వ్యక్తం చేశారు. కబ్జాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.