ఆ ఇద్దరు!
►ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత హరీష్, శరత్‌పైనే
►90 శాతం వక్ఫ్, దేవాదాయ భూములు పరాధీనం
►33 వేల ఎకరాలున్నా ‘వక్ఫ్’ ఆదాయం రూ.16 వేలే..
►లక్షలాది ఎకరాల శిఖం భూములు మాయం
►ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవుళ్లు
►సీఎం ప్రకటనతో భూముల స్వాధీనానికి కసరత్తు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గొలుసుకట్టు చెరువులు.. లక్షల ఎకరాల సర్కారీ భూములు.. మెతుకుసీమ ఆస్తులు. చెరువు నిండి చెలక పారితే.. భూమి శిస్తులతో ప్రభుత్వ ఖజానా కళకళలాడేది. నిజానికి తెలంగాణ వారసత్వ సంపద కూడా ఇవే. కాని ఇప్పుడా వైభవం లేదు. కాలంతో పాటే చెరువులు, కుంటలు, శిఖం భూములు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. చెరువు శిఖం భూముల నుంచి ప్రభుత్వానికి ‘దమ్మిడీ’ ఆదాయం లేదు. రాష్ట్రంలోనే ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆస్తులున్న జిల్లాలో నెల రాబడి కేవలం 16,500 రూపాయలే.
ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొలుసుకట్టు చెరువుల పునర్నిర్మాణం, ఆక్రమిత భూముల స్వాధీనం సవాల్‌గా మారింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం, కేసీఆర్ సొంత జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు ఆక్రమణకు గురై ఉండటం అటు మంత్రి హరీష్‌రావుకు, ఇటు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు ఓ సవాల్‌గా మారింది.
అబ్బో.. ఎంత భూమో..!
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 23 వేల ఎకరాల వక్ఫ్ భూములున్నట్లు ఇటీవల ప్రభుత్వం జరిపిన ప్రాథమిక సర్వేలో బయటపడింది. ఇందులో 99 శాతం భూమి కబ్జా అయింది. వీటికి సరైన రికార్డు లేకపోవడం, ఆస్తులు రెవెన్యూ అధికారుల అజమాయిషీలో కాకుండా ముతావలీల చేతిలో ఉండటంతో సులువుగా ఆక్రమణకు గురయ్యాయి. దాదా పు 20 వేల ఎకరాలకు పైగా ఉన్న దేవాదాయ భూములు చివరకు 3,651 ఎకరాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 180 దేవాలయాల కింద 3,651 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు దేవాదాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత భూమి కబ్జా అయిందనే సమాచారం అధికారుల వద్ద లేదు.
6,789 చెరువుల కింద 1,03,468.14 ఎకరాల శిఖం భూమి ఉంది. చెరువు ఎఫ్‌టీఎల్ భూములను కలుపుకుంటే ఇది 2.5 లక్షల ఎకరాలకు మించి ఉంటుంది. అన్ని రకాల భూములను కలుపుకుంటే జిల్లాలో 3,60,381.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ట్లు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో 60 శాతం భూమి ‘వైట్ కాలర్’ దోపిడీదారుల గుప్పిట్లో పడి నలిగిపోయింది. వేల ఎకరాల భూములు తిరిగి రావాలంటే జిల్లా భౌగోళిక స్వరూపం, భౌతిక పరిస్థితులతో పాటు రెవెన్యూ రికార్డులు, భూ సర్వే మీద బాగా పట్టున్న అధికారులు అవసరం. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు జిల్లా భౌగోళిక పరిస్థితులపై మంచి పట్టుంది.
హరీష్‌కు సవాలే...!
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా హరీష్ గొలుసుకట్టు చెరువుల మీద ద ృష్టి సారించారు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణ సంస్కృతిలో భాగమంటున్న హరీష్ .. అడ్డంకులను అధిగమించి చెరువుల పునర్నిర్మాణం చేస్తామని అంటున్నారు. ప్రతి చెరువును రక్షించి తీరుతామంటున్నారు. చెరువుల పూడికతీత పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై సర్వే చేయించినట్లు సమాచారం. పటాన్‌చెరులోని 9 చెరువు పనుల్లో జరిగిన అక్రమాలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆక్రమించిన వక్ఫ్ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులు ఎంతటి పెద్దవాళ్లయినా వదలబోమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే ప్రకటించిన మంత్రి, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే వక్ఫ్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేసి ఆక్రమణదారులకు బలమైన సంకేతాలు పంపించారు.
శరత్‌కు సాధ్యమేనా?
ఆక్రమిత భూముల పరిరక్షణకు రెవెన్యూ, సర్వే, భూ రికార్డులే ఆధారం. ఈ రికార్డులపై మంచి పట్టున్న అధికారిగా శరత్‌కు గుర్తింపు ఉంది. ప్రభుత్వ భూముల కోసం ఒక ప్రత్యేక ఫార్ములా రూపొందించి, దాని ఆధారంగా గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిని మొత్తం 15 కేటగిరీలుగా విభజన చేశారు. ఏ కేటగిరీలో ఎంత భూమి ఉందో స్పష్టంగా రికార్డులు తయారు చేసిపెట్టారు. నిజానికి ప్రభుత్వ భూమి ఎక్కడ ఎంత ఉంది? ఎవరి ఆధీనంలో ఉందో శరత్‌కు తెలిసినంతగా ఇతరులకు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన సేవలను వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు యోచిస్తున్నట్టు సమాచారం.