సిద్దిపేట అర్బన్: విద్యార్థికి రెవెన్యూ నేస్తం ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం.. దీన్ని ఉద్యమ గడ్డ సిద్దిపేటలో పప్రథమంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం ఉపయోగం సీఎం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి విద్యార్థులకు వ్యయప్రయాసలు దూరం చేస్తామన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థికి రెవెన్యూ నేస్తం పథకంలో 36,385 మంది విద్యార్థులకు కుల, ఆదాయ, స్థానిక ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకునే వారని ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులే విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేస్తారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన 43 శాతం ఫిట్మెంట్‌తో ఉద్యోగులు ఉత్సాహంగా ఉన్నారని విద్యార్థులతో పాటు ప్రజలందరికీ సేవలను చేరువ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరం ఈ సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపడతామని తెలిపారు. అందరి భాగస్వామ్యం కోసం సిద్దిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలో చదివే విద్యార్థులకు తక్కువ సమయంలో వేలాది సర్టిఫికెట్లను అందజేసిన సిబ్బందిని అభినందించారు. రూ. 20 కోట్లతో పీజీ కళాశాల, మరో రెండు పాల్‌టెక్నిక్ కళాశాలలు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీలను త్వరలో ఏర్పాటు చేసి ఉన్నత విద్య అవకాశాలను విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్‌వైగిరి, ఓఎస్‌డీ బాల్‌రాజు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్‌లు, డిప్యూటీ ఈఓ మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఎంఈఓలు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మంత్రిదే..
రైతులకు పారదర్శకంగా సేవలను అందించేందుకే జమీన్‌బందీ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. భూ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు జిల్లావ్యాప్తంగా సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత మంత్రి హరీష్‌రావు పైనే ఉంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని పట్టుదలతో, క్రమశిక్షణతో వాటిని చేరుకునేందుకు ముందుకు సాగాలి. పరీక్షలంటే భయం వద్దు..ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. విద్యార్థులకు రెవెన్యూ శాఖ అధికారులు పెద్ద ఎత్తున సర్టిఫికెట్లను అందజేయడం హర్షణీయం.
- జేసీ శరత్