తలుపులు మూసి.. పరీక్ష రాయించి.. | examination .. | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి.. పరీక్ష రాయించి..

Published Sun, Aug 7 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

తలుపులు మూసి.. పరీక్ష రాయించి..

తలుపులు మూసి.. పరీక్ష రాయించి..

నిజామాబాద్‌ నాగారం: సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌లో పదోన్నతుల కోసం ఆదివారం డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయంలో 23 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఆరు నెలల క్రితమే నిర్వహించారు. అప్పట్లో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే మాస్‌ కాపీయింగ్‌ జరిగిందంటూ ‘సాక్షి’లో ‘చూచిరాతలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి చూచిరాతలకు సహకరించారంటూ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ పరీక్షను రద్దు చేశారు. ఆరు నెలల క్రితం రద్దయిన పరీక్షను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. 24 మంది అభ్యర్థులకు గాను 23 మంది పరీక్ష రాశారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయ ఏడీఈ కిషన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. శాఖ సూపరింటెండెంట్‌ వెంకటేశం, సెక్షన్‌ క్లర్క్‌ స్వప్న పరీక్షల నిర్వహణ బాధ్యత నిర్వర్తించారు. అయితే ఈసారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పని దినాలలో కార్యాలయంలోని కిటికీ తలుపులు తెరిచి ఉంటాయి. కానీ పరీక్ష సమయంలో కిటికీలను మూసి ఉంచారు. అభ్యర్థులకు దోమలు కుట్టుతున్నాయంటూ ఆలౌట్‌ ఫాస్ట్‌ కార్డులను తెప్పించారు. పరీక్ష జరుగుతున్నంత సేపు కిటికీల తలుపులు మూసి ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించలేదు..
ఈ పరీక్ష రాస్తున్న ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్లు ముఖ్యంగా ఆయా మండలాల్లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్లు ఇతర మండలాల్లో పోస్టింగ్‌ వచ్చినా.. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సెక్షన్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసైతే డిప్యూటీ తహసీల్దార్‌లుగా పదోన్నతులు లభిస్తాయి. మండలాల్లో పని చేయని వారికి పదోన్నతుల పరీక్షకు అనుమతించడం సబబు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement