
సిరిసిల్ల : అటవీ గ్రామాల్లో పంటలకు వన్యప్రాణుల బెడద ఎక్కువైంది. నిత్యం చేతికొచ్చిన పంటలపై అడవి జంతువులు దాడి చేస్తూ పాడు చేస్తున్నాయి. అడవులను ఆనుకుని ఉన్న పల్లెల్లో అన్నదాతలకు కునుకు కరువై వణికిపోతున్నారు. జిల్లాలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, ముస్తాబాద్, కోనరావుపేట, సిరిసిల్ల, ఇల్లంతకుంట మండల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో రైతులు కంటికి రెప్పలా.. పంటకు కాపలా ఉంటూ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచెపైనే కునుకు తీస్తూ.. రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
అడవి పందులతో ఇబ్బంది
పంట పొలాలపై అడవి పందులు, నక్కలు, కోతులు దాడి చేస్తూ పాడు చేస్తున్నాయి. ప్రధానంగా మక్క, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలను వన్యప్రాణులు తినేస్తున్నాయి. పొద్దు తిరుగుడు పంటను పక్షులు బుక్కిపోతుంటే, మక్క కంకులను అడవి పందులు విరిచేస్తున్నాయి. వన్‌పల్లి, శాంతినగర్, రంగంపేట, అడవిపదిర, అక్కపల్లి, గర్జనపల్లి, అల్మాస్‌పూర్, రాజన్నపేట, తిమ్మాపూర్, గుండారం, గజసింగవరం, దమ్మన్నపేట, జిల్లెల్ల, లక్ష్మీపూర్, రుద్రంగి, మానాల, మరిమడ్ల, వట్టిమల్ల, వెల్జిపూర్, పెద్దలింగాపూర్, రామాజిపేట, లింగంపేట, సనుగుల, వీర్నపల్లి, రాజన్నపేట గ్రామాల శివారుల్లో అడవి పందులతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళల్లో పంటలపై పడి కర్రలు విరగ్గొడుతూ కంకుల్ని తింటున్నాయి. అడవి పందులను బెదిరించేందుకు రైతులు డప్పులతో చప్పుడు చేస్తూ రాత్రి వేళల్లో అలికిడి చేస్తూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంట చేతికందే దశలో అడవి జంతువులు పాడుచేయడం ఆందోళనకు గురి చేస్తోంది. చేను వద్ద ఉన్న మంచెలోనే ఉంటూ రైతులు పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గుంపులు.. గుంపులుగా దాడి
కోతులు, అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాలను చెడగొడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను అదిరించేందుకు రైతులు మూకుమ్మడిగా శ్రమించాల్సి వస్తోంది. ఒక వ్యక్తి ఉంటే మాత్రం కోతులు బెదిరిపోకుండా రైతులపైనే దాడికి యత్నిస్తున్నాయి. రుద్రంగి మండలం మానాలలో ఇటీవల కోతకొచ్చిన మక్క చేలపై పందుల మందపడి మూడెకరాల చేనును చెడగొట్టాయి. కర్రలు విరగ్గొడుతూ పంట చేనును పాడు చేశాయి. రాత్రి వేళల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు చేను దగ్గర ఉంటూ చలికి వణికిపోతున్నారు. ఒక్కోసారి వన్యప్రాణుల దాడిలోనూ గాయపడుతున్నారు. తిప్పాపూర్‌లో మరో రైతు మొక్కజొన్న కోసి కంకులను ఆరబెట్టగా ఆ కంకుల కుప్పపై పడి కోతులు బుక్కిపోయాయి.
కోతుల దండు ఊర్లలో కిష్కందకాండను సృష్టిస్తున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో గత ఏడాది కోతులు ఓ వృద్ధురాలిపై దాడిచేసి గాయపరచగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కపల్లి శివారులో మరో రైతుపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. ఇలా వన్యప్రాణులు వనాలు వీడి జనాల్లోకి వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా శ్రద్ధ వహించి అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
దాడి చేస్తే పరిహారం లభిస్తుంది
వన్యప్రాణులు దాడిచేసిన ఘటనల్లో బాధితులకు ప్రభుత్వం ద్వారా వైద్య ఖర్చులకు పరిహారం లభిస్తుంది. పంటలను చెడగొడితే.. ఎలాంటి పరిహారం ఇచ్చే అవకాశం లేదు. అడవులను నరికివేస్తూ.. వన్యప్రాణుల మనుగడకు సమాజమే ముప్పు తెస్తుంది. అందుకే అవి వనాలను వీడుతున్నాయి. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. హాని తలపెట్టవద్దు.
– అటవీశాఖ అధికారి