సాక్షి, హైదరాబాద్: సూడో డాక్టర్ సంతోష్ కుమార్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు న్నాయి. ఎలాంటి ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా వివిధ రకాలైన కోటాల్లో మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇతడిని బెంగళూరు అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. కేవలం బెంగళూరులోనే ఇతడి స్కామ్ రూ.100 కోట్లు ఉంటుందని వెలు గులోకి వచ్చింది.
రూ.30 కోట్లకు సంబంధించి 22 మంది ఫిర్యాదు చేయగా మిగిలినవారు మిన్నకుండిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన మిగిలిన సభ్యుల్ని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఢిల్లీకి వెళ్లడానికి సన్నా హాలు చేస్తోంది. సంతోష్ దాదాపు పదిహేనేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి ఈ ముఠా కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని సైతం నిర్వహించగా పోలీసులు దీన్ని సీజ్ చేశారు.
పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా...
పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడని అధికారులు చెప్తున్నారు. వెబ్‌సైట్లు హ్యాక్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం, స్ఫూఫింగ్‌కు పాల్పడటం కోసం బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకున్నారు. బాధితుల నుంచి నగదు సేకరిం చే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపేవాడు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే అనుచరులు వారణాసి కేంద్రంగా పనిచేస్తారు.
దేశంలో ఏ ప్రాంతంలో సేకరించిన నగదునైనా ఈ గ్యాంగ్ ముంబైకే తరలిస్తుంది. అక్కడ నుంచి హవా లా రూపంలో ఇతర చోట్లకు పంపిస్తుంటుంది. బెంగళూరు పోలీసులు బాధితులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరగా వారు అంగీకరించలేదు. తాము రూ.కోటి వరకు నగదు రూపంలో చెల్లించినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త తలనొప్పులు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.
రిక‘వర్రీ’గా మారిన డబ్బు
సంతోష్ అనేకమంది నుంచి కాజేసిన డబ్బు ఏమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతడు ఓ మతపరమైన సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తాను ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చానని, తమకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని పోలీసులకు సంతోష్ చెప్పాడు. ఇందులో నిజానిజాలను సైతం నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నారు.
దాదాపు 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినా కనీసం రూ.కోటి కూడా వాటిలో లేదని పోలీసులు చెప్తున్నారు. సంతోష్ ఈ పంథాలో రెచ్చిపోవడానికి ఢిల్లీకి చెందిన కొందరు బడాబాబుల సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేశారు. వీరిలో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment