
-పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో చదువుకోకుండా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ ఆడుతుండడంతో తల్లి మందలించినందుకు మనస్తాపంతో మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీకి చెందిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
- తాజాగా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి పబ్‌జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి కాలు, చేయి పడిపోయాయి. అచేతన స్థితిలో ఉన్న ఆ యువకుడు నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు.
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పబ్‌జీ తాజాగా నగరంలోనూ విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ పబ్‌జీ ఆటకు బానిసై... అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు చేరుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వ్యక్తులు... ఇప్పుడు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు.. ఆడొద్దని చెబితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలూ చేస్తున్నారు. తొలుత ‘పోకేమాన్’ అంటూ రోడ్డున పడిన యువత... ఆ తర్వాత బ్లూవేల్‌కు బానిసై ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడదే కోవలో పబ్‌జీ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారని, ఇందులో సుమారు 4 కోట్ల మంది నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నారని అంచనా. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి కేశవర్ధన్(19) రాత్రి వేళల్లో పబ్‌జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఫలితంగా కాళ్లు, చేతులు పడిపోయి అచేతనా స్థితిలో ఈ నెల 26న నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో ‘పబ్‌జీ’ మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్పత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ సకాలంలో గుర్తించి వైద్యం చేయడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఆటలో లీనమైతే అంతే...
పబ్‌జీ అంటే ‘ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్’ అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్‌జీ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్‌గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. దీంతో కొంతమంది టీమ్‌లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తులు సైనికులుగా మారిపోతారు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి శత్రువులతో పోరాడుతున్నామనే భావనలో ఉంటారు. ఒకసారి ఆట మొదలైందంటే యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆటలో లీనమైనవారు పక్కన ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అనే అంశాలనే కాదు చివరికి నిద్రాహారాలనే మరిచిపోతుంటారు. ఆటలో లీనమైతే మళ్లీ బయటకు రావడం కష్టమే. పైగా గ్రూప్‌తో కలిసి ఆడినప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆట ఆడేవారు తమని తాము సైనికులుగా భావిస్తారు. ఇది గ్రూప్ వాయిస్ గేమ్ కావడంతో యుద్ధం చేస్తుంది తామేననే భావన ఏర్పడి, తెలియకుండానే ఈ గేమ్‌కు బానిసలుగా మారి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.
మానసిక సమస్యలు..
ఈ ఆటతో పిల్లల మానసిక, శారీరక స్థితి తీవ్రంగా దెబ్బతింటోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆటాడే సమయంలో వీరు ఇతరులను పట్టించుకోరు. గేమ్ నుంచి దృష్టి మరల్చితే శత్రువుల చంపేస్తారనే భయంతో పరిసరాలను మరిచిపోతుంటారు. ఏకాగ్రత లోపించి చదువులో వెనకబడి పోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా, పిలిచినా పట్టించుకోరు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొంతమంది కోపంతో ఊగిపోతారు. ఈ ఆటకు బానిసలైన యువత నిద్ర లేమి, కంటి చూపుతో బాధపడుతుంటారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని ఆడడంతో మానసిక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో న్యూట్రిషన్ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్‌కు లోనవుతుంటారు. మెదడులో క్లాట్స్ ఏర్పడి, చివరకు కాళ్లు, చేతులు పడిపోతుంటాయి. – డాక్టర్ వినోద్‌కుమార్, న్యూరోఫిజిషియన్, సన్‌షైన్ ఆస్పత్రి
గేమ్‌ను నిషేధించాలి..
యువత రోజుకు 8–10 గంటలు ఈ ఆట ఆడుతోంది. దీనికోసం అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్‌పై నిషేధం విధించాయి. ఇటీవల జమ్మూలో ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ పబ్‌జీకి బానిసై పిచ్చివాడయ్యాడు. దీంతో అక్కడి ప్రభుత్వం పబ్‌జీని నిషేధించింది. గుజరాత్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ ఆటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశించింది. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం ఈ గేమ్‌పై నిషేధం విధించింది. మహారాష్ట్ర హైకోర్టు కూడా ఈ గేమ్‌ను నిషేధించింది. ఈ పబ్‌జీ గేమ్‌ను తెలంగాణలోనూ నిషేధించాలి.
– అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment