ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు వినూత్న ప్రచారం
నల్లగొండ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడంతో అవి మూతపడే పరిస్థితి వచ్చింది. మండల కేంద్రాలలో ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు కావడంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికీ పడిపోతున్న విద్యార్థుల నమోదు శాతాన్ని పెం చేందుకు విద్యాశాఖ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర అంశాలను సోమవారం నుంచి గ్రామాలలో వివరించనున్నారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ వినూత్నరీతిలో ప్రచారానికి తెరతీసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సైతం విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రచారం చేయనున్నారు.
ప్రభుత్వం నుంచి పాఠశాలలకు అందుతున్న ఉచిత యూనిఫాం, మధ్యాహ్నభోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత వంటి అంశాలతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. కరపత్రాలు, పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల ఫ్లెక్సీలు, పాఠశాలల నుంచి బయటకు వెళ్లి ఉన్నత స్థాయికి ఎదిగిన వారి గురించి వివరిస్తూ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రధానోపాధ్యాయుల కృషి చేయాల్సి ఉంటుంది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లాకు 50 వేల మంది కొత్త విద్యార్థులను పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలి. ఒక్కో తరగతిలో ఇప్పుడున్న విద్యార్థుల శాతానికి అదనంగా 30 శాతం మంది విద్యార్థులను చేర్పించాల్సిన బాధ్యత వారి పైనే ఉంటుంది. కొత్త విద్యార్థుల చేరిక ప్రధానంగా సక్సెస్ పాఠశాలల్లోనే ఎక్కువగా ఉండాలి. దీనికి సంబంధించి డీఈఓ విశ్వనాథ్‌రావు డివిజన్‌ల వారీగా హెచ్‌ఎం లు, ఎంఈఓలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం నల్లగొండ డివిజన్ సమావేశాన్ని చర్లపల్లిలోని డీవీఎం బీఈడీ కాలేజీలో నిర్వహించారు.
ఉపాధ్యాయులకు నోటీసులు..
పదో తరగతి ఫలితాల్లో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. పాఠశాల హెచ్‌ఎంతో పాటు సబ్జెక్టు టీచరును బాధ్యుల్ని చేస్తూ నోటీసులు జారీకానున్నాయి. అలాగే పదో తరగతిలో పరీక్ష తప్పిన విద్యార్థులకు జూన్ 1 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో అన్ని వసతులు కలిగి ఉండి లేదా మ ండల కేంద్రం లేదా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచి స్వీపర్లకు నెలకు రూ.2వేలు, టాయిలెట్ మెయింటెన్స్ కింద రూ. వెయ్యి చెల్లించనున్నారు.
మా బడికి రండి !
Published Sun, May 31 2015 1:25 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement