డిజిటల్ బడి
నల్లగొండ : సర్కారు బడులకు డిజిటల్ సొబగులు సమకూరనున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొత్త పుంతలు తొక్కనుంది. పాఠశాల విద్యలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో వెయ్యికి పైగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14 నుంచి ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా హైస్కూళ్లలో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఆర్‌ఓటీలు (రిసీవర్ ఓన్లీ టర్మీనల్), టీవీలు ఎన్ని ఉన్నాయి.. వాటిల్లో పనిచేస్తున్నవి ఎన్ని.. అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బుధవారం నాటికి పాఠశాలల వారీగా వివరాలను సమర్పించాలని విద్యాశాఖ ఆదేశాలు సైతం జారీ చేసింది.
డిజిటల్ విద్యకు సంబంధించి పాఠశాలల్లో అందుబాటులో లేని పరికరాలను ఈ నెల ఆరో తేదీలోగా ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల నుంచి సమకూర్చుకోవాలని జిల్లా విద్యా శాఖ నుంచి ఎంఈఓలకు ఆదేశాలు అందాయి. మూడు జిల్లాల్లోని (యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట) పాఠశాలల నుంచి వివరాలు వచ్చిన తర్వాత వాటిల్లో కొన్నింటిని రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయనున్నారు. అనంతరం ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనపై ఈ నెల పదో తేదీ నాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కసరత్తు మొదలుపెట్టారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించనున్నారు.
బ్లాక్ బోర్డు టు డిజిటల్ స్క్రీన్..
బ్లాక్ బోర్డు పాఠాల నుంచి విద్యార్థులకు తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన చేయనున్నారు. సీడీల్లో రికార్డు చేసిన పాఠ్యాంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో స్క్రీన్ పైన విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించనున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మూడు జిల్లాల్లో 229 పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధిస్తారని అధికారులు చెబుతున్నారు. 150 ఉన్నత పాఠశాలలు, 46 కేజీబీవీలు, 33 మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
వసతులు ఉన్నవాటికే తొలిప్రాధాన్యం...
డిజిటల్ తరగతులు ప్రారంభించాలంటే పాఠశాలలకు విద్యుత్ సదుపాయం, జనరేటర్, కంప్యూటర్, ప్రొజెక్టర్లు, ఆర్‌ఓటీలు, టీవీలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ మేరకు జిల్లాల్లో తొలి విడతలో అన్ని రకాల వసతులు కలిగిన పాఠశాలలనే ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఆర్‌ఓటీల సామర్థ్యాన్ని ఎంపీఈజీ-2 నుంచి ఎంపీఈజీ-4 టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది. దాదాపు 650 పాఠాలు కలిగిన హార్డ్‌డిస్క్‌లను పాఠశాలలకు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మూడు జిల్లాల్లోని చాలా పాఠశాలల్లో టీవీలు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు పనిచేయడం లేదు. కంప్యూటర్ విద్య బంద్ కావడంతో అవి అటకెక్కాయి.