ఖమ్మం క్రైం : గోదావరి పుష్కరాలు వచ్చే నెల 14 నుంచి 25 వరకు జరుగనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రతిరోజు లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇతర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అందుకుఅనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఎస్‌బీ కాన్ఫరెన్స్‌హాలులో గోదావరి పుష్కరాలకు సంబంధించి అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలతో పుష్కర పుణ్యస్నానాలను ఆచరించేందుకు వస్తున్న భక్తులకు తమ నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలను అందించేందుకు జిల్లాపోలీసులు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రతి పుష్కరఘాట్ వద్ద పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించి. ఘాట్ పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన బందోబస్తు ప్రణాళిక ప్రకారం పుష్కరఘాట్‌ల వద్ద విధులకు హాజరు కావాల్సిన సీఐ, ఎస్సైలు జూలై 1 నుంచే బాధ్యతలు స్వీకరించాలని సూచిం చారు. పోలీస్ సిబ్బంది మూడు షిప్ట్‌లుగా బందోబస్తు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్‌స్నాచింగ్, దొంగతనాల వంటి నేరాలు నియంత్రించేందుకు క్రైమ్‌టీమ్‌లను, క్యాట్‌పార్టీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెలిపేలా చర్యలు తీసుకోనన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రద్దీ ప్రదేశాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని నియమించనున్నామన్నారు. వేలల్లో వాహనాలు ప్రతిరోజు తరలివస్తాయనే అంచనాతో సమస్య తలెత్తకుండా అనుభవం కలిగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్లను పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో కేటాయించినట్లు తెలిపారు.
అన్ని కంట్రోల్‌రూమ్‌లు, సబ్‌కంట్రోల్ రూమ్‌లను మానిటరింగ్ చేసే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణం చర్యలు చేపట్టేవిధంగా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. వరంగల్ రోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్, బూర్గంపాడు, పాల్వంచ,కొత్తగూడెం, ఆంధ్ర సరిహద్దులోని ఎటపాక వద్ద పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వేమార్గంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, జిల్లా పోలీసుల సమన్వయంతో అదనపు టికెట్ కౌటర్లు రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు డీసీఎం రాఘునాథ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, దక్షిణామూర్తి, రాంరెడ్డి, సురేందర్‌రావు, కవిత, భాస్కరన్, వీరేశ్వరరావు, రాజేష్, సాయిశ్రీ, ఏఆర్‌డీఎస్పీ సంజీవ్ తదితర సిఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పుష్కరాలకు భారీ బందోబస్తు
Published Fri, Jun 19 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement