ఐటీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన క్వాల్కామ్ ఉత్పత్తుల సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్ హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కోకాపేటలో ఈ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 400 మిలి యన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంది. దశల వారీగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా పరోక్షంగా వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తా యని తెలిపింది.
విప్లవాత్మకమైన 5జీ మొబైల్ టెక్నాలజీపై ఈ క్యాంపస్‌లో పరిశోధనలు, పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ ప్లాట్‌ఫామ్స్ రంగా ల్లో పరిశోధనలు, వైర్‌లెస్ సాంకేతికత, పరికరాల తయారీ వంటి అంశాలపై పెద్ద ఎత్తున ఈ మెగా క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ ఈ రోజు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా సుమారు 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
అమెరికాలోని శాన్‌డియాగో కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తోందని వెల్లడించింది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఈ అభివృద్ధి కేంద్రం అమెరికా బయట ఉన్న వాటిలో అతిపెద్ద క్యాంపస్ కానుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొంది.
కేటీఆర్‌ను కలిసిన కంపెనీ ప్రతినిధులు..
బేగంపేట క్యాంపు కార్యాలయంలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శశిరెడ్డి బృందం కలిసి నగరంలో క్వాల్కామ్ ఉత్పత్తుల అభివృద్ది కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిపింది. ఇప్పటికే భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లో కంపెనీ అభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నామని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, నాణ్యమైన మానవ వనరుల లభ్యత బట్టీ నగరాన్ని తమ క్యాంపస్ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం నగరంలో తమ సంస్థ తరఫున 4 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కొన్నేళ్లలో ఇది 10 వేలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.
సెమీ కండక్టర్ల పరిశ్రమకు ఊతం: కేటీఆర్
క్వాల్కామ్ సంస్థ మెగా క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కేంద్ర కార్యాలయాలకు అవతల హైదరాబాద్‌లో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ అమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు అతిపెద్ద క్యాంపస్‌లు కలిగి ఉన్నాయని, ఈ జాబితా లో క్వాల్కామ్ చేరనుందన్నారు. క్వాల్కామ్ సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా క్యాంపస్ ద్వారా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల పరిశ్రమకు భారీ ఊతం లభించనుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment