రాజేంద్రనగర్ నియోజకవర్గం మ్యాప్
రాజేంద్రనగర్: ఈ నియోజకవర్గం పునర్‌విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. అంతకు ముందు చేవెళ్ల నియోజకవర్గంలో కొనసాగుతుండేది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 26 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీఆర్‌ఎస్, మజ్లిస్, మహాకూటమి, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ల మధ్య పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హైట్రిక్ కోసం కష్టపడుతున్నారు. మజ్లిస్ ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయనే ధీమాతో ఉంది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసద్ నేరుగా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయంపై ధీమాతో ఉన్నారు. మజ్లిస్‌ను ఓడించే సత్తా తనకే ఉందంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక, మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న గణేష్‌గుప్తాకు కాంగ్రెస్ కేడర్ సహకరిస్తుండడంతో విజయం తనదే అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఈసారి తనకే అవకాశం ఉందని చెబుతున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు.
మొత్తం ఓటర్లు 4,40,863
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 4,40,863 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,752 మంది మహిళలు, 2,33,039 మంది పురుషులు, ఇతరరులు 76 మంది ఉన్నారు.
బరిలో 26 మంది.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ నుంచి టి.ప్రకాష్‌గౌడ్, బీజేపీ తరఫున బద్దం బాల్‌రెడ్డి, మహాకూటమి(టీడీపీ) నుంచి గణేష్‌గుప్తా, మజ్లిస్ తరఫున మిర్జా రహమత్‌బేగ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
అభివృద్ధే నినాదం..
తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటూ చెబుతున్నారు. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 42 వేల మంది వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారని, వారంతా తన వెంటే ఉన్నారని అంటున్నారు. లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమనే ధీమాతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
మజ్లిస్‌ను తరిమికొడతానంటున్న బాల్‌రెడ్డి..
మజ్లిస్‌ను ఢీకొనే సత్తా బీజేపీకే ఉందని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆ పార్టీ పాగాను అడ్డుకునేందుకు తాను బరిలోకి దిగానని కమలం అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి చెబుతున్నారు. తాను పోటీ చేస్తుండడంతో మజ్లిస్, టీఆర్‌ఎస్‌లు ఏకమై ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర పథకాలపై ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు.
అభివృద్ధి చేస్తానంటున్న గణేష్‌గుప్తా..
తాజా మాజీ ఎమ్మెల్యే తొమ్మిదేళ్లు అభివృద్ధిని విస్మరించారని మహాకూటమి అభ్యర్థి ప్రకాష్‌గౌడ్ విమర్శన అస్త్రాలు సంధిస్తూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తాను చూపిస్తానంటూ వెల్లడిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుస్తానని అంటున్నారు. మహాకూటమిలోని ఇతర పార్టీల కేడర్ తోడవ్వడంతో విజయం సాధిస్తానని చెబుతున్నారు.
మైనార్టీ ఓట్లపై ఆశలు...
మైనార్టీ ఓట్లపై ఆధారపడిన మజ్లిస్ అభ్యర్థి మిర్జా రహమత్‌బేగ్.. పూర్తి ప్రచార బాధ్యతను ఎంఐఎం అధ్యక్షుడు అసద్‌పై ఉంచారు. గతంలో ఎన్నడు లేని విధంగా అసదుద్దీన్ నిత్యం సభలు నిర్వహిస్తూ మైనార్టీ ఓట్లు చీలకుండా వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే ఎక్కువ ఉండడంతో అవి గంపగుత్తగా తమ పార్టీకే పడతాయని, దీంతో విజయం ఖాయమని పార్టీ అభ్యర్థి అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment