నోబెల్ బహుమతి గ్రహీత బ్రియాన్ షెమిడ్ట్‌తో రాగదీపిక
ఆకాశంలోని నక్షత్రాలు చిన్ని బుర్రల్లో మెరుపులు మెరిపిస్తాయి. రాగదీపికకు మాత్రం నక్షత్రాల వెలుగుల వెనుక దాగిన చీకట్లను ఛేదించాలనే కోరిక కలిగింది. డ్వార్ఫ్ గెలాక్సీలపై పరిశోధన చేస్తున్న ఈ తెలుగమ్మాయిది గుంటూరు జిల్లా తెనాలి.
గగన దీపిక
పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. రాగదీపికకు చదువుకోవడం ఇష్టం. అయితే ఆమెకు అంతరిక్షం అంటే ఇంకా ఇష్టమని ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసింది. టెన్త్‌క్లాస్‌లో నారాయణ ఒలింపియాడ్‌లో సీట్ వచ్చింది. కానీ చేరలేదు. ఇంటర్‌కి ఢిల్లీలో అత్యంత సాధారణమైన కాలేజ్ సరస్వతి విద్యామందిర్‌లో చేరింది. అప్పుడే ‘ఢిల్లీ విద్యామందిర్ క్లాసెస్’ అనే కోచింగ్ సెంటర్‌లో ట్యూషన్‌కు వెళ్లేది. అక్కడ ఒక సబ్జెక్టులో వారానికి నాలుగు క్లాసులు మాత్రమే ఉంటాయి. అలా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత ‘నెస్’్ట రాసి విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్‌లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ (ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు)లో చేరింది. మనదేశంలో పిల్లలను పరిశోధన రంగంవైపు మళ్లించాలనే ఆలోచనతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెట్టించిన కోర్సు ఇది. భువనేశ్వర్, శాంతినికేతన్, బొంబాయిల్లో మాత్రమే ఈ కోర్సు ఉంది. అందులో దీపిక గోల్డ్ మెడల్ తెచ్చుకుంది.
నక్షత్రాల వేట
2018 జనవరిలో అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ సమావేశంలో పోస్టర్ ప్రెజంటేషన్, యూకేలోని డర్హామ్‌లో అంతర్జాతీయ సమావేశంలో ‘ఫ్లాష్ టాక్’ ఇచ్చింది రాగదీపిక. ప్రస్తుతం ట్యూసాన్‌లోని స్టూవర్డ్ అబ్జర్వేటరి, యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘డ్వార్ఫ్ గెలాక్సీస్–బ్లాక్ హోల్స్’ అనే అంశంపై పరిశోధన చేస్తోంది. ‘ఐసీ1613’ అనే డ్వార్ఫ్ గెలాక్సీ చుట్టూ అతి పురాతనమైన నక్షత్రాలు ఉన్నాయని ఈ పరిశోధనలోనే రాగదీపిక కనిపెట్టింది.
భూమ్మీదే ఆగిపోకూడదు
‘మనకు బాగా తెలిసిన ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు. ప్రపంచం చాలా విశాలమైంది. అంతరిక్షం అంతకంటే విశాలమైనది..’ అని.. సెలవులకు ఇండియా వచ్చినప్పుడు ఇచ్చే ప్రసంగాలలో తరచు చెబుతుంటుంది రాగదీపిక. తెనాలి, విజయవాడలోని కొన్ని స్కూళ్లు, కాలేజీల వాళ్లు పిల్లలకు గెస్ట్ లెక్చర్ కోసం దీపికను ఆహ్వానిస్తుంటారు. ‘‘మా నాన్నగారు ఖగోళశాస్త్రం పుస్తకాలు ఇష్టంగా చదివేవారు. దీపికకు తాతతో బాగా మాలిమి. ఆయన చదివే పుస్తకాలను చూస్తూ ఉండేది. దీపిక పదేళ్ల వయసులోనే మా నాన్నగారు పోయారు. కానీ ఈ రంగం మీద తనకు ఇష్టం కలగడానికి చిన్నప్పుడు పడిన తాతగారి ముద్రే కారణం అనిపిస్తుంది’’ అన్నారు రాగదీపిక తల్లి కనకదుర్గ.– బి.ఎల్.నారాయణ,సాక్షి, తెనాలి
మరో రెండు పరిశోధనలు
శాస్త్రవిజ్ఞానాన్ని వృత్తిగా స్వీకరించటానికి ప్రోత్సాహం కల్పించాలనేదే నా ఉద్దేశం. మరో రెండేళ్లలో నా పీహెచ్‌డీ పూర్తవుతుంది. తర్వాత ఇంకో రెండు పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. పరిశోధనలు సాగిస్తూనే ప్రొఫెసర్‌గా పనిచేయాలనేది నా కోరిక. ఏదైనా సాధించి మంచి సైంటిస్టుగా చరిత్రలో నిలవాలనేది నా లక్ష్యం.– రాగదీపిక, పీహెచ్‌డీ స్కాలర్
Comments
Please login to add a commentAdd a comment