
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు
కేతేపల్లి (నకిరేకల్) : భూమి పట్టా ఉన్న ప్రతి రైతుకూ రైతుబందు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేతేపల్లిలో మండలంలోని ఇప్పలగూడెం శివారులో రూ.3కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న ధాన్యం గిడ్డంగుల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంవత్సరంలో రెండు పంటలకు సాయాన్ని అందిస్తామన్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్, డిండి, మూసీ ప్రాజెక్టుల కింద ప్రతి నీటి చుక్కనూ వినియోగించుకుని రికార్డుస్థాయిలో రూ.650 కోట్ల విలువైన నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని అన్నారు.
దిగుబడులు భారీగా రావడంతో.. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని, ప్రాజెక్టు కింద నకిరేకల్ నియోజకవర్గంలో 62వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే గోదాములను నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.20 కోట్లతో మూసీ ప్రాజెక్టును ఆధునీకరించి 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామనని తెలిపారు. మూసీ కాల్వల ఆధునీకరించి.. చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు మరో రూ.65 కోట్లు మంజూరు చేశామన్నారు. నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చేసిన విజ్ఞప్తి మేరకు కేతేపల్లి మండలంలో స్థలం చూపించినట్లయితే సబ్‌మార్కెట్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందుకు కేతేపల్లికి చేరుకున్న మంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రింగు అంజయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నోముల నర్సింహ్మయ్య, పూజర్ల శంభయ్య, కేతేపల్లి ఎంపీపీ గుత్తా మంజుల, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, మార్కెట్ చైర్మన్ మొగిలి సుజాత, వైస్ చైర్మన్ ఎం.వెంకట్రాంరెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ హమీద్‌ఖాన్, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ బి.కవిత, ఎంపీడీఓ కిషన్, పి.ఇందిర తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కేతేపల్లి : ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర మార్కెటింగ్, బారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొత్తపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏమేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు.. రవాణా.. నిల్వ ఉన్న ధాన్యం రాశులు.. మద్దతు ధర తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉం చకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూ చించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగో లు చేసేలా మిల్లర్లతో చర్చించాలన్నారు. డబ్బుల చె ల్లింపులో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.