సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని కోరిన సంగతి తెలిసిందే. కేంద్రం కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని చెబుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్పినా చాలా చోట్ల జనాలు వినిపించుకోవడం లేదు. పోలీసులు అవగాహన కల్పిస్తున్న పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి చేరకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు పలుచోట్ల బారికేడ్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన ప్రజలను అదుపు చేయడానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుపై తిరుగుతున్న కార్లను, ఆటోలను నిలిపివేసి ఫైన్ వేయించారు. రోడ్లపైకి వచ్చినవారిని మీకేమైనా ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా అని ప్రశించారు. ఇంట్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లీడర్‌ను అంటూ ప్రభుత్వ అధికారులతో దురుసుగా మాట్లాడిన తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్‌పై కేసు నమోదు చేయాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు.
► కరీనంగర్ జిల్లాలో లాక్‌డౌన్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 20 ప్రైవేటు వాహనాలను డీటీసీ శ్రీనివాస్ సీజ్ చేశారు.
► నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రజా రవాణా చేస్తున్న పలు ఆటోలను, ఇతర వాహనాలను ఎస్‌ఐ అశోకుమార్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇకపై కర్ఫ్యూ ధిక్కరించి తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని అశోక్‌కుమార్ ప్రకటించారు.
► నల్గొండ జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేస్తున్నారు. హైవే పై టోల్‌గేట్‌లను పూర్తిగా మూసివేశారు. అత్యవసరం ఉంటే తప్ప ఎవరినీ రోడ్లపై అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు.
► సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్‌ను అంతమొందించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment