![Rajiv Ranjan Mishra meeting with Water Board officials - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/30/HY-21MUSIRIVER.jpg.webp?itok=huyRIQvM)
సాక్షి, హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన కసరత్తు మొదలైంది. మురికి మొత్తం వదిలించాలని జాతీయ నది పరిరక్షణ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధిచేసే కేంద్రాలు, మురుగునీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్ సీవర్, సబ్‌మెయిన్స్, లేటరల్ మెయిన్స్ పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, ఎస్టీపీలు, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇందుకోసం రూ. 13,479 కోట్ల అంచనాతో జలమండలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు మిశ్రాకు నివేదించారు. వీటి సాధ్యాసాధ్యాలపై ఆయన అంశాలవారీగా చర్చించారు. మంజీరా క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే నక్క వాగు సమూల ప్రక్షాళనకు రూ.2,404 కోట్లతో సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ పైనా చర్చించారు. ఈ భారీ ప్రక్షాళన పథకాలకు ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే అంశంపై గురువారం మంత్రి కేటీఆర్ తోనూ సమావేశం కానున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment