Rajiv Mishra
-
భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం: సాఫ్ట్బ్యాంకు
న్యూఢిల్లీ: భారత్లో సరైన కంపెనీలు, సరైన విలువలకు లభిస్తే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సాఫ్ట్బ్యాంకు ప్రకటించింది. 2022లో ఇలా 5-10 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని ‘ఇండియా ఎకనమిక్ ఫోరమ్ 2021’ సందర్భంగా సాఫ్ట్బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈవో రాజీవ్మిశ్రా తెలిపారు. దశాబ్దానికి పైగా భారత్లో సాఫ్ట్బ్యాంకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. గడిచిన ఆరేళ్లలో 14 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించారు. ‘‘ఈ ఏడాది ఇప్పటి వరకు 3 బిలియన్ డాలర్లు భారత్లో ఇన్వెస్ట్ చేశాం. ఏకంగా 24 కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. సాఫ్ట్బ్యాంకు పెట్టుబడులు కలిగిన పేటీఎం, పాలసీబజార్ (పీబీ ఫిన్టెక్) ఇటీవలే ఐపీవో ముగించుకోవడం తెలిసిందే. ఓయో, డెల్హివరీ సైతం ఐపీవో కోసం ఎదురుచూస్తున్నాయి. (చదవండి: నేను కూడా తగ్గేదే లే అంటున్న స్కోడా కంపెనీ) -
మూసీ ప్రక్షాళనకు ముహూర్తం ఇదే..!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన కసరత్తు మొదలైంది. మురికి మొత్తం వదిలించాలని జాతీయ నది పరిరక్షణ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధిచేసే కేంద్రాలు, మురుగునీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్ సీవర్, సబ్మెయిన్స్, లేటరల్ మెయిన్స్ పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, ఎస్టీపీలు, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకోసం రూ. 13,479 కోట్ల అంచనాతో జలమండలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు మిశ్రాకు నివేదించారు. వీటి సాధ్యాసాధ్యాలపై ఆయన అంశాలవారీగా చర్చించారు. మంజీరా క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే నక్క వాగు సమూల ప్రక్షాళనకు రూ.2,404 కోట్లతో సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ పైనా చర్చించారు. ఈ భారీ ప్రక్షాళన పథకాలకు ఎన్ఆర్సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే అంశంపై గురువారం మంత్రి కేటీఆర్ తోనూ సమావేశం కానున్నట్లు తెలిసింది. -
ఆయన్ను యాపిల్ లాగేసుకుందా?
న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో నువ్వానేనా అంటూ పోటీపడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు శాంసంగ్, యాపిల్ మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంసంగ్ కు చెందిన అతి ముఖ్యమైన ఉద్యోగి ఒకర్ని యాపిల్ తన వైపు లాక్కుంది. శాంసంగ్ లో మీడియా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు, మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న,రాజీవ్ మిశ్రాను యాపిల్ నియమించుకుంది. యాపిల్ ఇండియా మీడియా హెడ్ గా ఆయన్ను రిక్రూట్ చేసుకుంది. ఈ నియామకాన్ని మిశ్రా మీడియాకు బుధవారం ధృవీకరించారు. లోక్ సభ టీవీకి సీఈవోగా పనిచేసిన మిశ్రా , హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, స్టార్ TV, జీ టీవీ, రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్, న్యూస్ 24 తదితర వివిధ జాతీయ ఛానల్స్ కు పనిచేసిన అపార అనుభవం ఉంది. దీంతోపాటు వివిధ మంత్రిత్వ, మీడియా సలహా విభాగాలకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆద్యుడు మిశ్రా. కాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా చోటు చేసుకున్న ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ సీఈవో వరుసగా చైనా, భారత్ లలో పర్యటిస్తున్నారు. తద్వారా పడిపోయిన తమ మార్కెట్ ను తిరిగి పునరుద్ధరించుకునే పనిలో పావులు కదుపుతున్నారు. -
లోక్సభ టీవీ సీఈవోకు ఉద్వాసన
న్యూఢిల్లీ: త్వరలో పదవి నుంచి దిగిపోనున్న లోక్సభ స్పీకర్ మీరాకుమార్ లోక్సభ టీవీ చానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ మిశ్రాకు ఉద్వాసన పలికారు. లోక్సభ సీఈవోగా రాజీవ్ మిశ్రాను తొలగిస్తూ స్పీకర్ మీరాకుమార్ ఉత్తర్వులు జారీచేశారని లోక్సభ సచివాలయం శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. స్పీకర్ ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే మిశ్రా తొలగింపునకు స్పీకర్ ఎలాంటి కారణాలనూ ప్రస్తావించలేదు. తనను సర్వీసు నుంచి తొలగించడంపై మిశ్రా స్పందిస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే తొలగించడాన్ని తప్పుపట్టారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని ససారం నుంచి మీరాకుమార్ ఓడిపోయారని, ఆ వార్తను లోక్సభ టీవీలో ఫ్లాష్ న్యూస్లో ప్రసారం చేసినందుకే ఆమె తనపై వేటువేశారంటూ ఆరోపించారు.