సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం కేవలం భారత్ మాత్రమేనని అన్నారు. దేశాభివృద్ధి లో యువతను భాగస్వామి చేసి మోదీ సర్కారు.. భగత్ సింగ్ కలలు కన్న సుపరిపాలనను అందిస్తోందన్నారు. విశ్వంలో దేశం పేరు నిలబెట్టిన స్వామి వివేకానంద కూడా యువకుడేనని.. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పూర్తి మెజార్టీ పొందిన బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇంకా మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని రాజ్‌నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి హితం కన్నా రాజకీయ హితమే ముఖ్యమని అందుకే ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే తప్ప విపక్షాలకు దేశ అభివృద్ధి ఎజెండా లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టుకట్టే పార్టీ లు తర్వాత.. మీటూ.. ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. 2019లో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే.. 350 సీట్లు గెలిచేంత వరకు కార్యకర్తలు నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు.
కాగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో సమ్మేళనం నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు(ఆదివారం) జరుగునున్న యువభేరీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment