సాక్షి,సిటీబ్యూరో: పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీని ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించేదుకు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధికారులు మహానగరంలో మొత్తం 448 మసీదులను ఎంపిక చేశారు. వీటిద్వారా సుమారు 2.24 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేశారు. వీరికి ఆమేరకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో మసీదు ద్వారా 500 మంది చొప్పున గిఫ్ట్‌లను పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ప్యాక్‌లో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగ్ ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు. వీటితో పాటు మరో 30 వేలకుపైగా గిఫ్ట్ ప్యాకులను రిజర్వ్‌లో ఉంచారు. పేద ముస్లింలు ఎవరికైనా గిఫ్ట్ ప్యాకులు అందని పక్షంలో రిజర్వ్ చేసిన వాటి నుంచి అందించనున్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి మసీదులో కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా మసీదుల పరిధిలోని ముస్లింల స్థితిగతులను కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, పేదవారిని గుర్తించి వారికి గిఫ్ట్ ప్యాక్‌లు అందించనున్నారు.
ఇఫ్తార్ విందుకు రూ.లక్ష
రంజాన్ ఉపవాసలను పురస్కరించుకుని మసీదుల్లో దావత్–ఏ–ఇఫ్తార్ కార్యక్రమం కోసం మసీదుకు రూ.1 లక్ష చొప్పున ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులను వక్ఫ్‌బోర్డు నుంచి నేరుగా మసీదు కమిటీ ఖాతాలో జమచేయనున్నారు. మహానగర పరిధిలో ఎంపిక చేసిన 448 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఒక్కో మసీదులో 500 మంది చొప్పున ఈ విందు ఉంటుంది. మసీదులకు కేటాయించిన నిధుల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ నెల చివరి వారంలో ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment