నిర్మానుష్యంగా మారిన మక్కా మసీద్ రోడ్డు
చార్మినార్: రంజాన్ మాసంపై కరోనా ఎఫెక్ట్ పడటంతో ముస్లింలు జుమ్మాతుల్ విదా సందర్భంగా నిర్వహించే సామూహిక ప్రార్థనలు సైతం ఈసారి ఇళ్లల్లోనే నిర్వహించనున్నారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారాన్ని అల్ విధా జుమ్మా (జుమ్మాతుల్ విధా) అంటారు. అల్ విధా జుమ్మాకు రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చివరి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్ పండుగ)కు ముస్లిం ప్రజలు సిద్ధమవుతారు. రంజాన్ పండగ కోసం అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు నూతన దుస్తులు, చెప్పులు, అత్తర్‌లు, గాజులు..ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులను ఖరీదు చేస్తారు. షీర్‌కుర్మా లేనిదే రంజాన్ పండగ పూర్తి కాదు. ఇందుకోసం మార్కెట్‌లో షీర్‌కుర్మా సేమియాలు అందుబాటులోకి వచ్చాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ అందుబాటులో ఉండడంతో పాతబస్తీలోని మార్కెట్‌లన్నీ గురువారం జనంతో కిటకిటలాడాయి.
ఫుట్‌పాత్‌లపైనే మార్కెట్...
ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపైనే రంజాన్ మార్కెట్‌లు కొనసాగుతున్నాయి. అన్ని రకాల వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. చార్మినార్–మక్కా మసీదు రోడ్డులో రంజాన్ మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆశ్రయించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే భౌతిక దూరం పాటించకపోతే.. కోవిడ్ వైరస్ బారిన పడొచ్చని భావిస్తున్న కొంత మంది షాపింగ్‌కు దూరంగా ఉంటున్నారు. చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, పత్తర్‌గట్టి, మీరాలం మండి, పటేల్‌మార్కెట్, మదీనా, నయాపూల్ తదితర ప్రధాన రంజాన్ మార్కెట్ ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిర్మానుష్యంగా మారగా.. ఫుట్‌పాత్‌లపై కొనసాగుతున్న మార్కెట్ స్థానికులకు కొంత ఊరట కలిగిస్తోంది.
కొనసాగుతున్న ఉపవాసదీక్షలు...
ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనే రంజాన్ ఉపవాస దీక్షలు, రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు ఇళ్లల్లోనే కొనసాగుతున్నాయి. అల్ విధా జుమ్మా ప్రార్థనలను సైతం ఇళ్లల్లోనే నిర్వహించడానికి ముస్లింలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.వాస్తవానికి అల్ విధా జుమ్మా సందర్భంగా మక్కా మసీదు వేదికగా సామూహిక ప్రార్థనలు జరుగుతాయి. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చివరి శుక్రవారం కూడా ఇళ్లల్లోనే ముస్లింలు ప్రార్థనలు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌తో చార్మినార్–మక్కా మసీదు వీధులన్నీ బోసిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment