
చార్మినార్: ప్రస్తుత రంజాన్‌లో పాతబస్తీ కళ తప్పి కనిపిస్తోంది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో పాతబస్తీలోని ప్రధాన వీధులు బోసిపోయాయి. నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు లభిస్తుండడంతో ముస్లింలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇళ్లలోనే ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారు. రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తున్నారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సహర్‌తో రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టి సూర్యాస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులు కొనసాగిస్తున్నారు. పాతబస్తీలో కొనసాగుతున్న కంటైన్మెంట్ క్లస్టర్లలోని స్థానికులకు రంజాన్ మాసం ఉపవాస దీక్షలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ముస్లిం ప్రజలకు అవసరమైన పండ్లు, ఫలాలు కొనుగోలుకు వీలుగా ఆయా బస్తీలకే ఫ్రూట్ వెండర్స్‌ను తరలించినట్లు ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రజనీ కాంత్ రెడ్డి, అలివేలు మంగతాయారు,షేర్లీ పుష్యరాగం, సూర్యకుమార్, డి.జగన్ తెలిపారు. గతంలో వెజిటెబుల్ వెండర్స్‌ను అందుబాటులో ఉంచినట్లే.. ప్రస్తుతం రంజాన్ మాసం ఉపవాస దీక్షల సందర్బంగా ఫ్రూట్ వెండర్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు.