కేసీఆర్ పై పోటీ చేయి రాములమ్మ... ప్లీజ్!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత ముమ్మరం చేసింది. మెదక్ లోక్సభ బరి నుంచి స్థానిక ఎంపీ విజయశాంతి (రాములమ్మ)ని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే విజయశాంతితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఓ వేళ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అదే స్థానం నుంచి పోటీ చేస్తే విజయశాంతి అయితేనే సరైన అభ్యర్థి అని ఆ పార్టీ భావిస్తుంది.
కేసీఆర్ చేతిలో ఓడిపోయిన పక్షంలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇప్పటికే రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చిందంటా. 2009 ఎన్నికలలో మెదక్ లోక్సభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా రాములమ్మ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత విజయశాంతి కారు దిగి హస్తం గూటికి చేరిన విషయం విదితమే.
అయితే సికింద్రబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే, సినీనటి జయసుధా అదే స్థానం నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి వెల్లడించింది. దాంతో ఆమెను లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఇప్పటికే కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికైయ్యారు. ఆయన ముచ్చటగా మూడోసారి ఎంపీగా ఎన్నిక కావాలని తెగ ఆరాటపడుతున్నారు. ఆ తరుణంలో అంజన్న ఆశలకు జయసుధ గండికొట్టే పనిలో ఉన్నారు. అంజన్నను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సమాచారం.