రాములోరి కల్యాణం
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో వేదికపైకి తీసుకువచ్చారు. వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం మూడు గంటలపాటు వైభవంగా జరిపించారు. ప్రభుత్వం పక్షాన ఆలయ ఈవో దూస రాజేశ్వర్ దంపతులు పట్టువస్త్రాలను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివపార్వతులు ఆనవారుుతీ ప్రకారం నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అంక్షింతలు చల్లుకుంటూ రాజన్నను వివాహమాడారు.
ఓవైపు సీతారాముల కల్యాణం జరుగుతున్న సమయంలో మరోవైపు హిజ్రాలు నెత్తిన అక్షింతలు చల్లుకుంటూ పెళ్లిచేసుకున్నారు. మహాశివరాత్రి జాతరను తలపించే విధంగా దాదా పు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గురువారం రాత్రంతా స్వామి వారి దర్శనానికి అనుమతించినా ఐదు నుంచి ఆరు గంటలకు పైగా పట్టింది. సాయంత్రం యువకులు, హిజ్రాల నృత్యాలు, శివపార్వతుల పూనకాల మధ్య రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. కాగా.. తెలంగాణ వచ్చినా తమకు కనీస ప్రాధాన్యం కల్పించలేదని, ఇలాగైతే వచ్చే ఏడాది ఉత్సవాలకు తాము వేములవాడకు రాబోమని జోగిని శ్యామల అధికారుల తీరుపై మండిపడ్డారు.
యాదాద్రిలో కల్యాణం కమనీయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయసన్నిధిలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. సీతారాములను పట్టువస్త్రాలు, నగల తో అలంకరించి ముత్యాల పల్లకిపై కల్యాణవేదిక వద్దకు చేర్చారు.
మధ్యాహ్నం అర్చకుల వేద మంత్రాల మధ్య సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. దేవస్థాన ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సిం హమూర్తి దంపతులతోపాటు భక్తులు పాల్గొన్నారు.
- యాదగిరికొండ
ఒక్కటైన ఫ్యాక్షన్ గ్రామం
ఐదు దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో అట్టుడుకుతున్న ఆ గ్రామం సీతారాముల కల్యాణంలో ఒక్కటైంది. పోలీసుల కృషి ఫలితంగా ఫ్యాక్షన్ గొడవలకు బ్రేక్ పడింది. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో యాభై ఏళ్లుగా తరచూ ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయి.
గ్రామంలో సీపీఎం, సీపీఐ పార్టీలదే ఆధిపత్య పోరు. శ్రీరామ నవమి కల్యాణోత్సవాలకు నిర్వహించినవారు మాత్రమే హాజరయ్యేవారు.
- మఠంపల్లి