వీరగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కాకతీయుల కాలం నాటి శిలాశాసనం
సాక్షి, హైదరాబాద్: అది నాలుగు పదాల వాక్యం.. రూప బాణ క్షితి శశి! వీటిని కలిపి చదివితే అర్థమేమీ స్ఫురించదు. కానీ విడివిడిగా అర్థాలు చూస్తే.. రూప అంటే రూపం, బాణ అంటే బాణం, క్షితి అంటే భూమి, శశి అంటే చంద్రుడు. వాటికి అంకెల రూపమిస్తే.. 1511. కాస్త ఆశ్చర్యంగా, అయోమయంగా అనిపిస్తున్నా.. మన పూర్వీకుల భాషా విన్యాసా నికి ఇదో మచ్చుతునక. అంకెలను అంకెలుగా చెప్పకుండా సంస్కృత/తెలుగు పదాలతో వివరించటం, పదాలను అక్షరాలుగా కాకుండా అంకెల్లో చెప్పటం వారి భాషా ప్రత్యేకత. దానికి సజీవ నిదర్శనమే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం లోని వీర గోపాలస్వామి దేవాలయంలో ఉన్న 15 అడుగుల ఎత్తున్న భారీ శాసనం.
ఇదీ ఆ శాసనం కథ..
వీరగోపాలస్వామి ఆలయానికి కాకతీయుల కాలంలో కోటనాయకులు భారీగా భూమిని దానమిచ్చారు. స్వామికి వైభవంగా భోగాలు నిర్వహించటంతోపాటు స్వామిని అర్చిస్తున్న బ్రాహ్మణులకు ఈ భూములు సమర్పిస్తున్నట్టుగా ఓ భారీ శాసనాన్ని చెక్కించి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఆ భూమి వివరాలతో కూడి న ఈ శాసనంలో అప్పటి కాలాన్ని కూడా పేర్కొన్నారు. శక సంవత్సర ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం అది 1151 (క్రీ.శ. 1229). ఇక్కడే నాటి పాలకులు భాషా పటిమను ప్రదర్శించారు. సంవత్సరాన్ని సాధారణ పద్ధతిలో అంకెల్లో ఏర్పాటు చేయటం కంటే సంస్కృత పదాల్లో చెక్కిస్తే బాగుంటుం దని భావించారు. అందుకు శాతవాహనులకు పూర్వమే రూపొందినట్టుగా పేర్కొనే కాలమానిని అనుసరించారు. దీని ప్రకారం ఒక్కో అంకెకు అక్షరాలతో కూడిన పర్యాయ పదాలుంటాయి.
అక్షరాలకు అంకెల రూపమిదీ..
శాసనంపై.. ముందుగా రూప అనే పదం ఉంది. రూప అంటే రూపం. సాధారణంగా మనిషి రూపం ఒక్కటే ఉంటుంది. దీన్ని ఒకటికి గుర్తుగా వాడారు. ఇక రెండో పదం బాణ. అంటే బాణం. మన్మథ బాణాలు ఐదుంటాయి. అందుకే ఐదుగా ఖరారు చేశారు. ఇక మూడో పదం క్షితి. అంటే భూమి. గ్రహాల్లో భూమి ఒక్కటే ఉంటుంది. ఇది ఒకటికి సూచిక. చివరి పదం శశి. అంటే చంద్రుడు. చంద్రుడు కూడా ఒక్కడే. ఇది కూడా ఒకటికి చిహ్నం. ఈ నాలుగు పదాలకు అంకెల రూపమిస్తే.. 1511. శాసనాల్లో అంకెలను పదాల్లో చెప్పే పద్ధతిలో మరో విచిత్రం కూడా దాగి ఉంది. అదే వామాంకగతిలో చదవటం. అంటే.. కుడి నుంచి ఎడమకు చదవాలి. ఇక్కడ 1511ని ఆ పద్ధతిలో చదివితే 1151 అవుతుంది. అదే నాటి సంవత్సరం. శక సంవత్సరం 1151లో ఈ శాసనాన్ని ఏర్పాటు చేశారన్న మాట!
వేయించింది కోట కేతన పాలకులు
ఇలా అంకెలను పదాల జతలతో రాయించిన శాసనాలు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన శాసనాన్ని రాజేశ్వరపురం గోపాలస్వామి ఆలయంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్, చంటి, రాగి మురళి తదితరులు గుర్తించారు. దాని భావాన్ని తర్జుమా చేశారు. దీన్ని కాకతీయుల సామంతులు, తర్వాత వారికి బంధువులైన కోటకేతన పాలకులు వేయించారు. కృష్ణానదికి దక్షిణాన 6 వేల గ్రామాలకు వీరు ప్రభువులని చరిత్ర చెబుతోంది. ఈ శాసనంలో ఆ వంశానికి చెందిన కేతన, భీముడు, కేశవభూపతి, బయ్యమాంబ పుత్రుడు మాధవ భూపతి, భేరుండ కేతన, అతని భృత్యుడు కామిరెడ్డి, వెర్రమ, కాట్రెడ్డి మాచిరెడ్డి, ధీరుడు గోపాలవర్ధనుడు, ప్రోలాంబిక పుత్రుడు మందడి ప్రోలుడుల పేర్లు ఉన్నాయి.
భూమి వివరాలు చెప్పే చోట ‘ప’అన్న అక్షరాన్ని వాడారు. ప అంటే పట్టు అని, అది పెట్టికి పర్యాయపదమని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. అంటే పుట్టెడు ధాన్యం పండే భూమి అన్న విషయాన్ని ‘ప’అక్షరంతో చెప్పారు. అలాగే వైశాఖ మాసాన్ని మాధవమాసంగా, శుక్రవారాన్ని కావ్యవారంగా ఇందులో పేర్కొన్నారు. శాసన స్తంభానికి రెండు వైపులా కలిపి 52 పంక్తులు చెక్కి ఉన్నాయి. భూమితోపాటు రాట్నపు బావిని కూడా ఏర్పాటు చేసినట్టు అందులో ఉంది. అది మోటబావిలాంటిదన్నమాట. నాటి పాలకులు దేవాల యాలకు మాన్యం, దాంతోపాటు వ్యవసాయానికి కావాల్సిన వసతులు కల్పించి ఆలయాలను పోషించేవారనడానికి ఇదో చక్కటి నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment