లక్డీకాపుల్ : వచ్చే నెల(జూలై) 5వ తేదీ వరకు రేషన్ డీలర్లకు రావాల్సిన బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్డీకాపుల్‌లో శుక్రవారం జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ... సమ్మె నోటీసులు ఇచ్చిన చర‍్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ రాష్ట్రంలో డీలర్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఒకవేళ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు లారీలతో పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ల అసోసియేషన్ తమకు మద్దతుగా ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది డీలర్లు తమతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు శాంతియుతంగా దీక్ష చేశామని, ఇకపై జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓఆర్ కట్టకుండా సహకరించిన ప్రతీ ఒక్క డీలర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కడుపు కాలినా పట్టించుకోరా..
రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్స్ సప్లై విభాగంలో అవార్డులు రావడానికి కారణం మేము కాదా అంటూ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి డీలర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం దారుణమన్నారు. కడుపు కాలి బాధను వెళ్లగక్కుతూ సమ్మె చేసినా తమను ప్రభుత్వం పట్టించుకోలేవడం లేదని ఆరోపించారు. నకిలీ వేలి ముద్రలు, బ్లాక్ మార్కెట్‌తో డీలర్లకు ఎటువంటి సంబంధం లేదన్న రాజు.. అలాంటిది ఏమైనా ఉందని తేలితే గుండు కొట్టించుకుంటానంటూ వ్యాఖ్యానించారు. 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని.. 2015 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పోరాటం చేస్తామన్నారు. డీలర్లను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సరుకులు సరఫరా చేసేందుకు మహిళ సంఘాలు 80శాతం వరకు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలు తమకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. డీలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ముఖం చూసైనా తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ విషయంలో ఆమె చెప్పినట్లుగా నడుచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment