బియ్యం ‘నో స్టాక్‌...! | Ration Dealers Negligence on Rice Distribution | Sakshi
Sakshi News home page

బియ్యం ‘నో స్టాక్‌...!

Published Wed, Oct 16 2019 10:58 AM | Last Updated on Wed, Oct 16 2019 10:58 AM

Ration Dealers Negligence on Rice Distribution - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ‘పేదల బియ్యానికి’ కొరత ఏర్పడింది. అక్టోబర్‌ కోటా గడువు చివరి రోజైన మంగళవారం రేషన్‌ దుకాణాల ఎదుట ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఒక వైపు అదనపు కోటా కేటాయింపు లేకుండానే రేషన్‌ పోర్టబిలిటీ లావాదేవీలు.. మరోవైపు పూర్తి స్థాయి కోటాను డీలర్లు లిఫ్ట్‌ చేయకపోవడం పేదల పాలిట శాపంగా మారింది. ఫలితంగా గడువు చివరి రోజుల్లో పేదలకు బియ్యం అందని దాక్ష్రగా మారింది. హైదరాబాద్‌ నగరంలో స్టేట్, జిల్లా పోర్టబిలిటీ తోపాటు నేషనల్‌ పోర్టబిలిటీ సైతం ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీనికి తగినట్లుగా అదనపు కోటా కేటాయించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారగణం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో అక్టోబర్‌  నెలకు గాను మొత్తం 1,37,75,936 కిలోల బియ్యం కోటా అవసరం కాగా పౌరసరఫరాల శాఖ 1,25,78,130 కిలోల బియ్యాన్ని  కేటాయించింది. అందులో ఏఎఫ్‌ఎస్‌సీ కింద 10,62,390 కిలోలకు గాను 9,23,978 కిలోలు, ఎఫ్‌ఎస్‌సీ కింద 1,26,99,816 కిలోలకు గాను 1,16,44,110 కిలోలు, ఏఏపీ కింద 13,730 కిలోలకు గాను 10,042 కిలోలు కేటాయించారు. బియ్యం కోటాకు సంబంధించి సుమారు 1630 ఆర్వోలను విడుదల చేసింది. అందులో 1319 ఆర్వోలకు సంబంధించిన సరుకులు మాత్రమే డీలర్లు లిఫ్ట్‌ చేశారు. మిగిలిన  311 ఆర్వోలకు సంబంధించిన బియ్యం నిల్వలు లిఫ్ట్‌ చేయలేదని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  వాస్తవంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో సుమారు 3,744,57 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా, ప్రధాన గోదాంలో బియ్యం నిల్వలు లేకుండా పోయాయి.
 
కార్డులు ఇలా..
హైదరాబాద్‌ పౌరసరఫరాల శాఖ పరిధిలో సుమారు 5,86,107 ఆహార భద్రత (రేషన్‌) కార్డులు ఉండగా, అందులో 21,94,444 మంది లబ్దిదారులు ఉన్నారు. మొత్తం కార్డుల్లో 30,271 ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు అందులో 80,344 యూనిట్లు, ఎఫ్‌ఎస్‌సీ  కింద 5,54,520 కార్డులు  అందులో 21,12,728 లబ్ధిదారులు,  ఏఏపీ కింద 1316 కార్డులు  అందులో 1372 యూనిట్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సరుకుల డ్రా ఇలా.
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా అక్టోబర్‌ కోటా డ్రా లబ్ధిదారులకు చుక్కలు చూపించింది. సుమారు 20 శాతం లబ్ధి కుటుంబాలు సరుకులను డ్రా చేయలేక పోయారు.  చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15 వరకు నెలసరి కోటా పంపిణీ జరుగుతుంది. మొత్తం 7,06,146 లావాదేవీలు జరుగగా అందులో  సరుకుల డ్రాకు చివరి రోజైన మంళవారం  13,792 లావాదేవీల ద్వారా సరుకుల డ్రా జరిగినట్లు ఆన్‌లైన్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా రేషన్‌ పోర్టబిలిటీ పేదల బియ్యం కోటాపై తీవ్ర  ప్రభావం చూపుతోంది.  జిల్లా పోర్ట్టబిలిటీ కింద  2,12,912 లావాదేవీలు జరగగా, అం దులో చివరిరోజు 7,577 లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర పోర్టబిలిటీ కింద మొత్తం 56,884 లావాదేవీలు, అందులో చివరి రోజు 1380 లావాదేవీలు జరిగినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తమకు కేటాయించిన దుకాణాల్లో మొత్తం 4,36,360 కార్డుదారులు సరుకులు డ్రా చేసుకున్నారు. అందులో చివరి రోజైన మంగళవారం 4,835 మంది సరుకులు డ్రా చేసుకున్నట్లు ఆన్‌లైన్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పూర్తిస్థాయిలో బియ్యం లిఫ్ట్‌ చేయలేదు
అక్టోబర్‌ మాసానికి అవసరమైన రేషన్‌ కోటాను కేటాయించడం జరిగింది. డీలర్ల వారీగా ఆర్వోలను సైతం విడుదల చేశాం, అయితే సుమారు 20 శాతం వరకు డీలర్లు  తమ కోటా పూర్తి స్థాయిలో లిఫ్ట్‌ చేసుకోలేక పోయారు. మరోవైపు పొర్టబిలిటీ విధానం కూడా కొంత వరకు ప్రభావం చూపింది.    – తనూజ, డీఏం. హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement