సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ గురువారం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ మొదలుకానుంది. ఇప్పటికే బియ్యం సరఫరా పూర్తయిన జిల్లాల్లో పంపిణీని ఆరంభించి, మిగతా చోట్ల శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో అందజేయనున్నారు. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల వంతున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా గోదాముల నుంచి 12 వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాలకు సరుకు రవాణా వాహనాల ద్వారా బియ్యం సరఫరా అవుతోంది. చాలా చోట్ల సరఫరా పూర్తికాగా, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జరగనుంది. సరఫరాకు అనుగుణంగా గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రజలు గుమిగూడకుండా, ఒకేసారి ఎగబడకుండా చర్యలకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
ఆ మూడు జిల్లాలు కీలకం..
వన్‌కార్డు–వన్ రేషన్ విధానం ద్వారా లబ్ధిదారులు రేషన్ పోర్టబిలిటీ విధానంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. చాలామంది గ్రామాల్లోని లబ్ధిదారులు, కూలీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నారు. కనీసంగా 30లక్షల మందికి పైగా ప్రతినెలా పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల పరిధిలో బియ్యం కొరత రాకుండా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఈ జిల్లాల్లో అదనపు బియ్యాన్ని అందుబాటులో ఉంచనుంది. ఆ బియ్యాన్ని స్థానికంగా ఉండే పాఠశాలల్లో లేదా కమ్యూనిటీ కేంద్రాల్లో నిల్వ చేయనుంది. ఇక రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. దీంతో పాటే 040–23447770 ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఏవైనా సమస్యలుంటే తీసుకురావచ్చని వెల్లడించింది. వాట్సాప్, ల్యాండ్‌లైన్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉండనుండగా, టోల్‌ఫ్రీ నంబర్‌లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటాయి. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను ఈ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.
‘కీ–రిజిస్టర్‌తో పంపిణీ చేయాలి’
కరోనా భయంతో జమ్మూకాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ–పాస్ మిషన్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి తాత్కాలికంగా కీ–రిజిస్టర్‌పై రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారని, అదే విధానం ద్వారా రాష్ట్రంలోనూ పంపిణీ చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బయోమెట్రిక్ విధానంతో రద్దీ పెరిగి డీలర్లు, కార్డుదారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దృష్ట్యా ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇక ఉచిత బియ్యం సరఫరాకు హమాలీ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రేషన్ షాపుల ద్వారా శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment