గాజర్ల రవి సురక్షితం
మూడ్రోజుల ఉత్కంఠకు తెర
సాక్షి, భూపాలపల్లి: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ చనిపోలేదని ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు తెలిపారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో గాజర్ల రవి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గణేశ్ సోదరులు సమ్మయ్య, అశోక్ అలియాస్ ఐతు మల్కన్‌గిరికి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం వారు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి మృతదేహాలను పరిశీలించారు. అందులో గణేశ్ మృతదేహం లేదని అశోక్ తెలిపారు. గణేశ్ వివరాల కోసం ఫోన్‌లో సంప్రదించగా ‘‘బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మల్కన్‌గిరి పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నాం.
ఒక మృతదేహాన్ని చూసేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతించారు. నాతో పాటు మా అన్న సమ్మయ్య, వదిన విజయ వెళ్లాం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్ని మృతదేహాలను చూశాం. అందులో గణేశన్న మృతదేహం లేదు. దీంతో గణేశన్న ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని నిర్ధారించుకున్నాం. వెంటనే ఈ కబురు వెలిశాల ప్రజలకు తెలిపాం. తేలికపడిన మనసుతో మల్కన్‌గిరి నుంచి హన్మకొండకు వస్తున్నాం’’ అని అశోక్ వివరించారు. అలాగే ఎన్‌కౌంటర్‌లో గణేశ్ భార్య ప్రమీల అలియాస్ జిలానీ బేగం చనిపోయిందని జరుగుతున్న ప్రచారానికి కూడా తెరదించారు. మృతదేహాల్లో జిలానీ బేగం లేదని స్పష్టం చేశారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ కు రెండ్రోజుల ముందే మావోయిస్టు అగ్రనేతలంతా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లినట్లు అశోక్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు చూసేందుకు మల్కన్‌గిరికి వచ్చిన మాజీ మావోలు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్రనేతలు ఎవరూ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని భావిస్తున్నట్లు వివరించారు.