- పోలీసులపై రాళ్ల దాడి
- ఇద్దరికి గాయాలు
తబొల్లారం రైతుబజార్‌కు ఎదురుగా ఉన్న ఓంసాయి కాలనీలోని మాజీ సైనికుడి ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. బొల్లారం ఇన్‌స్పెక్టర్ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికాలనీలో మాజీ బ్రిగేడియర్ జీబీ రెడ్డి, రక్ష దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో దొంగలు జీబీ రెడ్డి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి చొరబడి ఇళ్లంతా చిందరవందర చేశారు.
అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు, కొందరు వ్యక్తులను చూసి వారు గోడకు ఆనుకొని నిల్చున్నారు. అనుమానంతో పోలీసులు వారిని ఆరా తీశారు. దీంతో ఆ వ్యక్తులు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. తప్పించుకు వెళ్లిన వారు వెనుదిరిగి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.
గాయాలపాలైన పోలీసులు తాము పట్టుకున్న వ్యక్తిని వదిలేశారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. గాయపడిన పోలీసులు వెంకటేష్, రంగస్వామిని ఆస్పత్రిలో చేర్పించారు. నార్త్ జోన్ డీసీపీ జయలక్ష్మి, మహంకాళి ఏసీపీ మనోహర్, దుండిగల్ ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.