సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా రెడీ అని అన్నారు. ఎవరు ఏమిటనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే తేలిపోతుందన్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ కంటే అధిక స్థానాలు గెలిచి తీరుతామన్నారు. అలా రాని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని నర్సారెడ్డి శపథం చేశారు. మరోవైపు కేసీఆర్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బ్యాటు పట్టుకుని బరిలోకి దిగాక ఎటువంటి బంతినైనా బౌండరీ దాటిస్తానన్నారు.
ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వలసవాదుల పాలన మాకొద్దని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్.. ఇప్పుడు అదే వలస వాదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి స్థానికులు దొరకలేదా? కేసీఆర్ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చి స్థానికేతరునిగా ఎలా పోటీ చేస్తారని అన్నారు. స్థానిక వాదాన్ని ఒక అంశంగా తీసుకుని ఎన్నికలకు వెళ్తానని అన్నారు.
తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాకు లీకుల మీద లీకులు ఇస్తున్నారని, ఇటువంటి లీకుల రాజకీయాలు మానేసి బరిలో నిలబడి కలబడాలని ఆయన టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసని, టీఆర్‌ఎస్ పార్టీ పుట్టక ముందే తాను తెలంగాణ కోసం కొట్లాడనని అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోనే టీఆర్‌ఎస్ బలం బయట పడుతుందన్నారు. కేసీఆర్‌ను తాను ఇప్పటి వరకు కలవలేదని, అప్పుడెప్పుడో నెల రోజుల కింద ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి కలిశానని అన్నారు.
కేసీఆర్‌పై పోటీకి సై
Published Thu, Mar 27 2014 11:34 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
Advertisement
Advertisement