
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: మహాకూటమిలో రె‘బెల్స్’ షురూ అయ్యాయి. చివరి దాకా ప్రయత్నించి టికెట్ దక్కని ఆశావహులు రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు స్థానాల్లో అసమ్మతి నెలకొంది. కార్యకర్తల నిర్ణయం మేరకు అడుగులు వేస్తామని టికెట్ దక్కని వారు ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టికెట్ దక్కకపోవడంతో కోదాడ నుంచి బొల్లం మల్లయ్యయాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నారు. సూర్యాపేట టికెట్ రాకపోవడంతో ఈనెల 15న భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ఉంటుందని పటేల్ రమేష్‌రెడ్డి ప్రకటించారు.
ఉత్తమ్ పై.. బొల్ల మల్లయ్య ఫైర్
తాజాగా కోదాడ నుంచి మహాకూటమిలో భాగంగా టికెట్ వస్తుందనుకున్న టీడీపీ నేత బొల్లం మల్లయ్య.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తమ్ తన సతీమణి పద్మావతికి టికెట్ కోసం.. తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని మల్లయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కోదాడలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేదనతో మాట్లాడుతూ ఇండిపెండింట్‌గా బరిలో దిగుతానని ప్రకటించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలనని విమర్శిస్తున్న ఉత్తమ్ కోదాడలో చేస్తుంది కుటుంబ పాలన కాదా ..? అని బొల్లం మల్లయ్య కార్యకర్తల సమావేశంలో ప్రశ్నించారు. మహాకూటమిలో అగ్రవర్ణాలు .. బీసీలకు అన్యాయం చేశాయని, తనకు టికెట్ రాకుండా ఉత్తమ్ అడ్డుకున్నారన్నారు. ఉత్తమ్, ఆయన సతీమణి హుజూర్‌నగర్, కోదాడలలో పోటీ చేస్తూ,కోదాడలో తనకు వచ్చిన అవకాశాలపై దెబ్బ తీశారని, తన నోటికాడి కూడును లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సతీమణి కోసం 2014లో మహబూబ్‌జానీని, ఇప్పుడు తనను ఉత్తమ్ మోసం చేశాడని అన్నారు. చందర్‌రావు, ఉత్తమ్‌ల మధ్య చీకటి ఒప్పందం ఉందని వారిద్దరు తప్పా ఇతరులను కోదాడలో గెలవనీయకుండా చూసుకుంటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో బీసీలను ఏకం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు.
పటేల్ పయనం ఏటు..?
టికెట్ రాకపోవడంతో మంగళవారం ఢిల్లీ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి సూర్యాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుచరగణం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఇంటికిచేరుకున్న రమేష్‌రెడ్డిని చూసి ఆయన సతీమణి లావణ్య బంధువులు కంటితడిపెట్టారు. వారందరిని చూడడంతో రమేష్‌రెడ్డి కూడా కన్నీరుమున్నీరయ్యారు. టికెట్ రాలేదని అభిమానులు కూడా కంటతడి పెట్టారు. ఆతర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 25 ఏళ్లు మచ్చలేకుండా రాజకీయం చేశానని, ఇప్పటికీ తనకే టికెట్ వస్తుందన్నారు. పార్టీలో ఏ వర్గం లేదని, అంతా రాహుల్‌గాంధీ వర్గమేనన్నారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడవద్దన్నారు. అయితే ఆరోజు రమేష్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాడా..?, లేక ఆయనకు ఇంకా టికెట్‌పై ఏమైనా ఆశలు ఉన్నాయా..?, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిసి పనిచేస్తారా..? అని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment