కామారెడ్డిలో ఫలించిన బుజ్జగింపులు! | Rebel Candidates Support To The Congress Party In Nizamabad | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ఫలించిన బుజ్జగింపులు!

Published Fri, Nov 23 2018 4:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rebel Candidates Support To The Congress Party In Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో పలువురు నేతలు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు కోసం నల్లమడుగు సురేందర్‌తో పాటు సుభాష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మదన్‌మోహన్‌రావు, జమునారాథోడ్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం సురేందర్‌కే టికెట్టు కేటాయించింది. దీంతో సుభాష్‌రెడ్డి బీఎస్పీ నుంచి నామినేషన్‌ దాఖలు చేయగా, కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగాగా నామినేషన్‌ వేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు కోసం కాసుల బాల్‌రాజు, మల్యాద్రిరెడ్డిలు తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ బాల్‌రాజు వైపే మొగ్గు చూపింది. దీంతో మల్యాద్రిరెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు.

 
నామినేషన్ల ప్రక్రియ అనంతరం కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ తిరుగుబాటు నేతలపై దృష్టి పెట్టింది. వారిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే తమకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వాల్సిందేనంటూ తిరుగుబాటు నేతలు మొండికేశారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సుముదాయించారు. తిరిగి గురువారం కామారెడ్డి పట్టణానికి సమీపంలోని లింగాపూర్‌ గ్రామంలో రెబెల్స్‌తో శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ జాతీయ నాయకులతో ఫోన్‌లో మాట్లాడించి వారికి నచ్చజెప్పారు. భవిష్యత్‌పై భరోసా కల్పించినట్లు సమాచారం. దీంతో రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన సుభాష్‌రెడ్డి, మల్యాద్రిరెడ్డి, కృష్ణారెడ్డిలు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నారు. వెనువెంటనే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల వద్దకు వెళ్లి తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో తిరుగుబాట్ల గొడవ సద్దుమణిగింది. తిరుగుబాటు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిన్నటి వరకు ఉన్న అయోమయం, ఆందోళన తొలగిపోయినట్టయ్యింది.  

ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు 

కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు రాలేదన్న కోపంతో తిరుబాటు జెండా ఎగురవేసిన నేతలను అధిష్టానం బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడంతో అభ్యర్థులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. 
ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్, బాన్సువాడలో కాసుల బాల్‌రాజులు తిరుగుబాటు నేతలతో చేతులో చేయి వేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించుకున్నారు. ప్రచారంలో అందరూ పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో పార్టీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసి, బుజ్జగింపులతో ఉపసంహరించుకున్న సుభాష్‌రెడ్డి, మల్యాద్రిరెడ్డిలకు బలమైన అనుచరవర్గం ఉంది. అటు అభ్యర్థుల క్యాడర్, ఇటు తిరుగుబాటు అభ్యర్థుల అనుచర వర్గం కలిసి పనిచేస్తే కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 

ఇక ప్రచారానికి..

టికెట్ల కేటాయింపులో జాప్యంతో ఇంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులు.. ఇక ప్రచారంలోకి దిగనున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు షబ్బీర్‌అలీ, సౌదాగర్‌ గంగారాంలు ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. అయితే బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తేలకపోవడంతో మొన్నటివరకూ ప్రచారం నామమాత్రంగానే సాగింది. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియలు ముగియడం, తిరుగుబాట్ల సమస్య సమసిపోవడంతో ఇక పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి సారించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రచారానికి రానుండడంతో ప్రచార ఉధృతిని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement