తిరుగుబాటు | Rebellion | Sakshi
Sakshi News home page

తిరుగుబాటు

Published Sat, Nov 8 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

Rebellion

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
 ‘నేను ఉద్యోగులతో మరీ మెత్తగా వ్యవహరిస్తున్నానేమో. ఈ జిల్లా పనితీరుకు నేను సరిపోనేమో. ఉద్యోగులు ఇలా వ్యవహరిస్తే నేను ఈ జిల్లా కాకపోతే మరో జిల్లాకు బదిలీపై వెళ్తానేమో. ఉద్యోగులు చేస్తున్న ఆందోళన చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతను కింది వారితో పూర్తి చేయించడమే నేను చేసిన తప్పా.

నేను పని అప్పగించి నిద్రపోవడం లేదే. నేను పనిచేస్తూనే మిగతా వారిని చేయమంటున్నా. నేను తనిఖీలు చేసిన చోట ఉద్యోగులందరూ సంతోషంగా తమ పనితీరును వివరించారు. ఎక్కడా ఎవరూ ఒత్తిడికి గురైనట్లు చెప్పలేదు. బంగారు తెలంగాణ కోసం అం దరూ కష్టపడి పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయినా సమస్య ఇక్కడ లేదు. మరెక్కడో ఉన్నట్టుంది. అసోసియేషన్లు అందరికీ ఉన్నాయి.

ఐఏఎస్‌ల నుంచి ఆఫీసర్ల దాకా ఉన్నాయి’. ఇవేవో సాదాసీదా అధికారి చేసిన వ్యాఖ్యానాలు కావు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ‘సాక్షి’ ఎదుట వ్యక్తం చేసిన వ్యాఖ్యలు. ‘వర్క్ టు రూల్’ పేరిట రెండు రోజులుగా జిల్లాలో రెవెన్యూ సిబ్బంది చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగుల నడుమ నెలకొన్న వాతావరణానికి కలెక్టర్ వ్యాఖ్యలు అద్దం పట్టాయి. ఈ యేడాది జూలై 31న జిల్లా కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని బదిలీపై వచ్చారు.

ఆగస్టులో సమగ్ర సర్వే, ఆ తర్వాత రుణమాఫీ అర్హుల జాబితా గుర్తింపు, సామాజిక పింఛన్ల పథకంలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, వివరాల కంప్యూటరీకరణ వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పురోగతిపై చర్చించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తమపై పని ఒత్తిడి పెంచుతున్నారంటూ ఉద్యోగులు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ ఉద్యోగులే కీలకం కావడం కూడా కలెక్టర్‌పై అసంతృప్తికి దారి తీసింది.

 వీఆర్వో మృతితో ఆగ్రహం
 చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ వీఆర్వో రాంరెడ్డి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. కలెక్టర్ పని ఒత్తిడి పెంచడం వల్లే వీఆర్వో చనిపోయారంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘రాత్రి వేళల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు, తనిఖీల పేరిట కలెక్టర్ ఉద్యోగులకు విరామం లేకుండా చేస్తున్నారు. గతంలో ఎన్నో కార్యక్రమాల అమలులో పాల్గొన్నపటికీ ఎన్నడూ ఇంత ఒత్తిడి ఎదుర్కోలేదంటూ’ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కలెక్టర్, ఉద్యోగుల నడుమ నెలకొన్న విభేదాలు వీఆర్వో మృతితో తీవ్ర రూపం దాల్చింది. రెండు రోజులుగా వర్క్ టు రూల్ పేరిట రెవెన్యూ ఉద్యోగులు జిల్లా అంతటా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ‘వర్క్ టు రూల్’ అంటే ఒక్క ఫైల్ కూడా ఉద్యోగుల వద్ద పెండింగు ఉండకూడదు.

నేను క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్షలు చేస్తూనే ఫైళ్లు కూడా క్లియర్ చేస్తున్నా కదా అంటూ కలెక్టర్ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కలెక్టర్, ఉద్యోగుల నడుమ నెలకొన్న విభేదాలు పింఛన్ల జాబితా కంప్యూటరీకరణకు అవరోధంగా తయారైంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో పాలన కుంటుపడి అభివృద్ధిపై ప్రభావం చూపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement