సాక్షి, హైదరాబాద్: రికార్డు స్థాయిలో యాసంగి(రబీ) ధాన్యం దిగుబడి వస్తుందని, కనీసం 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు రానుందని మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై శనివారం ముగ్గురు మంత్రులు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో రికార్డు స్థాయిలో 21.64 లక్షల ఎకరాల్లో వరి సాగైందని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతుధర కన్నా తక్కువ చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంస్థలు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన రైతు తన పంటను 24 గంటల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లోనే వారికి చెల్లింపులు జరగాలని ఆదేశించారు. కందుల కొనుగోళ్లలో రైతులకు ఇంకా రూ.150 కోట్లకుపైగా బకాయిలు ఉన్నామని, మూడురోజుల్లో వాటిని రైతులకు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
ఈసారి అటు నిజాంసాగర్, సింగూరు, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులతోపాటు మధ్య తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల ద్వారా సాగునీరు యాసంగిలో పుష్కలంగా అందించినందున అదే స్థాయిలో ఎకరానికి 35 క్వింటాళ్లకుపైగా ధాన్యం రానుందని మంత్రులు చెప్పారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఆర్‌ఐలను కొనుగోలు కేంద్రాలకు ఇన్‌చార్జులుగా నియమించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్లు ప్రతిరోజు ఉదయం గంట సేపు ధాన్యం సేకరణ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో పౌర సరఫరాల కమిషనర్ సి.వి.ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.
రికార్డుస్థాయిలో యాసంగి ధాన్యం
Published Sun, Apr 16 2017 3:40 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
Advertisement
Advertisement