
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పౌర సరఫరాలశాఖ చేపట్టిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. మిల్లర్ల నుంచి 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ను పూర్తిస్థాయిలో సేకరించింది. ఖరీఫ్ సీజన్లో 99.99%, రబీసీజన్లో 99.98% బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంత భారీ మొత్తంలో సీఎమ్మార్‌ను సేకరించడం పౌరసరఫరాల శాఖ చరిత్రలోనే తొలిసారి. ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
రికార్డు స్థాయి సేకరణ: ఈసారి రబీలో 37.20లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎమ్మాఆర్ కోసం రైస్ మిల్లులకు అప్పగించింది. ఇందుకుగాను 25.28 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వా నికి అప్పగించాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 25.26 లక్షల టన్నుల (99.98%) బియ్యాన్ని అప్పగించారు. ఖరీఫ్‌లో 16.48 లక్షల టన్నుల ధాన్యానికిగాను 11.04 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా 11.03 (99.98%) లక్షల టన్నులు అప్పగించారు.
ఫలించిన ప్రణాళిక
మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించడంలో పౌరసరఫరాల శాఖ పక్కా ప్రణాళికతో వ్యవహ రించింది. మిల్లుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ధాన్యం కేటాయింపులో అధికారులు ఒక క్రమపద్ధతిని పాటించారు. ఈ ఏడాది రబీ లో గడువులోగా బియ్యం అప్పగించని మిల్లర్ల మిల్లింగ్ చార్జీలో కోత విధిస్తామన్న నిబంధన మంచి ఫలితాన్నిచ్చింది.
అందరి సహకారంతోనే: సీవీ ఆనంద్
వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మిల్లర్ల నుంచి 99 శాతానికి పైగా బియ్యాన్ని సేకరించామని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీని వెనుక మిల్లర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయపన్ను, వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయడం, శాఖలోని అన్ని వ్యవహారాలను ఆన్‌లైన్ చేసి నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలతో సత్ఫలితాలు వచ్చాయని ఆయన వివరించారు.